HIGH COURT: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో అధికారులు కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్లు దాఖలు చేయకపోతే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తగిన సమయం ఇచ్చినప్పటికీ.. అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మూడు వేర్వేరు కేసుల్లో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, నీటి పారుదల, గనుల శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం ఆదేశించింది. లేని పక్షంలో తదుపరి విచారణకు హాజరై.. వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలన్న పిల్‌పై గురువారం విచారణ జరిగింది. డంపింగ్ యార్డు కోసం రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో స్థలాన్ని గుర్తించామని పేర్కొన్నప్పటికీ.. సమగ్ర సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. గండిపేట మండలం పుప్పాలగూడలో నాలా ఆక్రమణలు.. గజ్వేల్‌లో చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.
ఇవీ చూడండి..