ఆస్పత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టరును తొలగిస్తూ గాంధీ ఆస్పత్రి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. కాంట్రాక్టరు వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా కాంట్రాక్టు రద్దు చేయడం సరికాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. నిలోఫర్ ఆస్పత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టరు సురేష్ బాబు అక్రమాలకు పాల్పడ్డారని భగవంతరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు.. సురేష్ బాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని గతంలో ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో సురేష్ బాబు గాంధీ ఆస్పత్రి కాంట్రాక్టును రద్దు చేశారు. దాన్ని సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. దాంతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. కోర్టులో కేసులతో ప్రభావితం కాకుండా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ కాంట్రాక్టరు తప్పు చేసినట్లయితే నిబంధనల ప్రకారం వ్యవహరించి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇవీ చూడండి: 'ఏపీ ప్రాజెక్టులు ఆపకపోతే.. అలంపూర్-పెద్దమారూర్ వద్ద ఆనకట్ట నిర్మిస్తాం'