సభలు, ప్రదర్శనలకు అనుమతుల విషయంలో పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించడం లేదన్న వ్యాజ్యంపై ప్రభుత్వానికి, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి షఫీక్ ఉజ్జమాన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. సభలు, సమావేశాలకు సరైన కారణం లేకుండానే అనుమతులు నిరాకరిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో చివరి నిమిషంలో వేదిక లేదా సమయం మార్చుకోవాలని, వీడియో చిత్రీకరించాలని తదితర అసంబద్ధమైన ఆంక్షలు విధిస్తున్నారని పేర్కొన్నారు.
భావప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. హాళ్లు, చుట్టూ ప్రహరీ ఉన్న మైదానాల్లో సభలకు పోలీసులు ఒత్తిడి చేయకుండా అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో సభలు, ప్రదర్శనలకు కూడా శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంటేనే అనుమతులు అడగాలని కోరారు. సభలు, ప్రదర్శనల ప్రతిపాదిత తేదీలకు కనీసం వారం రోజుల ముందే ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.
ఇవీ చూడండి: విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి