లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలు కట్టుదిట్టంగా అమలయ్యేలా శ్రమిస్తూనే... అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తమ గస్తీ వాహనాల్లో సకాలంలో ఓ గర్భిణిని ఆసుపత్రికి చేర్చి సేవాభావం చాటుకున్నారు. నాంపల్లిలో రోడ్డుపక్కన నివసించే యాచకులు, కార్మికులకు ట్రాఫిక్ డీసీపీ బాబురావు ఆహారపొట్లాలు అందించారు.
ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
చౌటుప్పల్ పరిధిలోని లక్కారంలో... నల్గొండ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయాలంటే ప్రజలు ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటించాలని మహేశ్ భగవత్ కోరారు.
సత్తుపల్లిలో సండ్ర..
హైదరాబాద్ లాలాగూడలో షబానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మందికి నిత్యావసర సరకులు అందించారు. ముషీరాబాద్‌లో గ్రేటర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వంటసరుకులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సామగ్రి అందించారు. ఇల్లెందు నియోజకవర్గం మర్రిగూడెంలో న్యూడెమోక్రసీ నాయకులు గ్రామస్థులకు కూరగాయలు పంపిణీ చేశారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
పేదలకు బియ్యంతో పాటు పప్పు, వంటనూనె తదితర సామగ్రి ప్రభుత్వమే అందించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షాల సలహాలు స్వీకరించాలని మర్రిశశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'