heavy rains in telangana: మూడు రోజులు కాస్త బ్రేక్ ఇచ్చిన వరుణుడు.. మళ్లీ జోరు చూపిస్తున్నాడు. కుండపోత వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా మరోసారి చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనగామ బస్టాండ్‌తో పాటు జనగామ-హైదరాబాద్ రహదారి పూర్తిగా జలమయమైంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు.. పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. పెద్దముప్పారం-దంతాలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
దంతాలపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 21 సెంటిమీటర్లు, జనగామ జిల్లా దేవరుప్పులలో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దాట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ జలమయమైంది. కుమ్మరికొంట్ల పెద్ద చెరువు అలుగుపారడంతో.. రేపోని, జాలుబావుల, లక్ష్మీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ముప్పారం శివారులో వరదలో తొర్రూరుకు చెందిన నలంద పాఠశాల బస్సు చిక్కుకోగా.. అందులో ఉన్న విద్యార్థులను స్థానికులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
వరదలో చిక్కుకున్న బస్సు..: జనగామ జిల్లా పర్వతగిరి మండలంలో పెద్దమోరి వాగు పోటెత్తుతోంది. వర్ధన్నపేటలో ఆకేరువాగు పరవళ్లు తొక్కుతోంది. నర్సంపేట పరిధిలోని పాకాల సరస్సు నిండుకుండలా మారింది. నర్సింహులపేట మండలం.. కొమ్ములవంచ వద్ద.. అలుగు పోస్తున్న కొత్త చెరువులో.. పాఠశాల బస్సు వరదలో చిక్కుకోగా.. స్థానికుల చొరవతో క్షేమంగా బయటపడ్డారు.
మహబూబాబాద్-నెల్లికుదురు ప్రధాన రహదారి.. రావిరాల లో లెవల్ వంతెనపై వరద ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలోనూ పలు మండలాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. జలగలంచ వాగు ఉప్పొగడంతో.. హనుమకొండ-ఏటూరు నాగారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వైపు వెళ్లే వాహనాలన్నీ పస్రాలోనే నిలిపేశారు.
లోతట్టు కాలనీల్లోకి వర్షం..: జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లోని ఆదర్శ పాఠశాల పొలాల మధ్య ఉండటంతో వరద పోటెత్తి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. తల్లిదండ్రులు, గ్రామస్థులు పిల్లలను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వికారాబాద్ జిల్లాలో వీరంపల్లి వద్ద రోడ్డుపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి ఆలయం సహా గుట్ట పరిసరాలను వర్షం ముంచెత్తింది. లోతట్టు కాలనీల్లోకి వర్షం నీరు చేరింది.
ప్రాజెక్టులకు మరోసారి వరద..: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు, చెక్‌డ్యాములు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని లెండి వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పిట్లం మండలంలో నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జుక్కల్ మండలం బాబాల్గావ్, సవాల్గావ్ ప్రాంతాలకు రవాణా స్తంభించింది. నాగిరెడ్డిపేట్లో అత్యధికంగా 15 సెంటీమీటర్లు, నిజాంసాగర్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ కౌలాస్ నాలా, పోచారం ప్రాజెక్టులకు మరోసారి వరద పోటెత్తుతోంది.
ఆ జిల్లాల్లో రెడ్ అలెర్ట్..: భారీ వర్షాలపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ.. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మరో నాలుగు రోజులు కుంభవృష్టి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.