Heavy Rains in Hyderabad Today : రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ కుండపోత వర్షం(Heavy Rains in Hyderabad) కురిసింది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. అనేక చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి, బేగంపేట, అమీర్ పేట, సికింద్రాబాద్, జీడిమెట్ల, సూరారం, బాలానగర్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, మలక్ పేటలో భారీ వర్షం కురిసింది.
Hyderabad Rains Today : బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్, బాలాజీ నగర్, ప్యాట్నీ ప్యారడైజ్, బేగంపేట్ ప్రాంతాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వనస్థలిపురం, కుత్బుల్లాపూర్, చింతల్, గుండ్ల పోచంపల్లితో పాటు అనేక ప్రాంతాలు నీటమయమయ్యాయి. వరద నీటితో రహదారులన్నీ జలమయం కాగా.. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొగా.. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్(Hyderabad Traffic Jam)కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Hyderabad Floods Today : హైదరాబాద్ లో రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి బోయిన్ పల్లి ప్రాంతంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. హస్మత్ పేట ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు రావడంతో.. ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. రామన్న కుంట చెరువు సమీపంలోని శ్రీనివాస నగర్ కాలనీలో రహదారిపై పూర్తిగా నీరు నిలిచి వాహనాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. చింతల్‌లోని ఇంద్రసింగ్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Safety Precautions in Monsoon Telugu : భారీ వర్షాల వేళ బయటకెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు మరవకండి..?
అవస్థలు పడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు : గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో కురిసిన భారీ వర్షానికి మైసమ్మగూడలోని ఇంజినీరింగ్ కళాశాలల హాస్టళ్ల వద్ద భారీగా నీళ్లు నిలిచాయి. మల్లారెడ్డి, సెయింట్ పీటర్స్, నర్సింహారెడ్డి కళాశాలల హాస్టళ్ల నుంచి బయటకు వచ్చేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రగడ్డ ప్రధాన రోడ్డుపై వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మ్యాన్‌హోల్‌లో చెత్త పేరుకుపోవడంతో వరదనీరు నిలిచిపోయింది. రోడ్లపై నిలిచిన వరదనీటిని బయటకు పంపించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Rain in Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలకు రాచకొండ పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కాలువలు, కల్వర్టులు దాటేందుకు ప్రయత్నించవద్దని తెలిపారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలు ప్రమాదకరంగా ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద, శిథిలమైన గోడల పక్కన ఉండవద్దన్న పోలీసులు, నీటి ప్రవాహాలు ఉన్న కొత్త దారిలో వెళ్లవద్దని హెచ్చరించారు.
Monsoon Safety Measures : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా విద్యుత్ సరఫరా పరిస్థితిని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సమీక్షించారు. భారీగా వర్షాలు కురుస్తునందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల విద్యుత్ పరికరాలు, విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉంటాయని, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలన్న సీఎండీ, ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలని తెలిపారు. విద్యుత్ సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తెలపవచ్చని సూచించారు. మరోవైపు మేడ్చల్ దుండిగల్ ను వరుణుడు ముంచెత్తాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఒక్కసారిగా భారీవాన కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
Hyderabad Rains Today : హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటపాటు కుండపోత వర్షం.. విద్యాసంస్థలకు సెలవు