Telangana Rains Today 2023 : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ముఖ్యంగా.. హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ఉదయం పనుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో.. వాహన దారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే అండర్‌పాస్ మొత్తం నీట మునిగింది. మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
Telangana Rains Alert 2023 : నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ శివారు కాలనీవాసులు వణికిపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, ఘట్‌కేసర్, బోడుప్పల్, పిర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండటంతో.. రోజుకో కొత్త కాలనీ ఏర్పాటు అవుతుంది. కొత్త కాలనీలలో సరైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై ఎక్కడ ఎలాంటి గుంతలు ఉన్నాయో తెలియక.. వాహనాదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు.
Godavari Water Level at Bhadrachalam : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో.. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. అటు ప్రాణహిత, ఇటు ఇంద్రావతి నుంచి వస్తున్న ప్రవాహంతో.. నీటిమట్టం 43అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరినందున అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కలెక్టర్ కలెక్టర్ డా. ప్రియాంక అలా జారీ చేశారు. గోదావరి నుంచి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తున్నందున.. ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
సింగరేణికి కోట్లల్లో నష్టం : భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజల్ని అధికారుల ఇప్పటికే అప్రమత్తం చేశారు. క్షణం ఆగకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు గనుల్లో ఓపెన్ కాస్ట్‌ల్లోకి వరదనీరు చేరడంతో.. బొగ్గు వెలికితీయడం కష్టసాధ్యమయ్యింది. రోడ్లు అన్ని బురదమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటి వరకు సుమారు 12వేల టన్నుల బొగ్గు వెలికితీతకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సింగరేణి అధికారులు మోటార్ల సహాయంతో నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడుతున్నారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో.. సింగరేణికి భారీ నష్టం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు.
సిద్దిపేటలో భారీ వరద : ఎగువ నుంచి వస్తున్న వరదతో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ మోయతుమ్మెద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారి పైనున్న వంతెన మీద నుంచి నీరు వెళుతుండటంతో.. పోలీసులు రహదారికి అడ్డుగా బారికేడ్లు పెట్టి.. రాకపోకలు నిలిపివేశారు. దాంతో బస్వాపూర్, పోరెడ్డిపల్లి, నాగసముద్రాల మీదుగా హనుమకొండకు.. వాహనాలను దారి మళ్లించారు. పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద నిర్మించిన పార్వతిబ్యారేజ్ నిండుకుండలామారింది. భారీ వర్షాలు కురుస్తుండడం, 15 రోజులుగా సరస్వతి పంపుహౌస్ నుంచి.. నీటిని ఎత్తిపోస్తుండటంతో జలకళ సంతరించుకుంది. పార్వతీబ్యారేజ్ పూర్తిస్థాయిలో నిండుకుండలా మారడంతో. సరస్వతి పంపుహౌస్‌లో మోటార్లు నిలిపివేశారు. క్రమంగా నీటిమట్టం పెరుగుతుండటంతో.. గోదావరి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.
భారీ వర్షాలకు వర్ధన్నపేట మీదుగా ఉన్న ఆకేరు వాగులోకి వరద నీరు చేరి అలుగు పోస్తుంది. ఇల్లంద గ్రామంలోని సుభాష్ నగర్, శివనగర్‌లో వరద నీరు పోటెత్తింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిండటం వల్ల రెండు పంటలు పండుతాయని ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి దిగువకు పెద్దమొత్తంలో నీరు విడుదల అవుతుండటంతో.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: