Harish Rao on 2023 Assembly Elections : రాష్ట్రానికి స్ట్రాంగ్ లీడర్ కావాలో.. రాంగ్ లీడర్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Harishrao) పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్(Telangana Bhavan)లో భారత వైద్యుల సంఘం, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డా. బీఎన్ రావుతో పాటు.. పలువురు వైద్యులు బీఆర్ఎస్(BRS)లో చేరారు. వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదేళ్లుగా తెలంగాణ స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ చేతిలో ఉన్నందునే.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మిగతా నేతలు పదవుల కోసం రాజకీయాలు చేస్తే.. కేసీఆర్ ఒక టాస్క్‌తో చేస్తున్నారని తెలిపారు. సుపరిపాలన, సురక్షిత పాలన అందిస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ కోసం ఒకప్పుడు చైనా, రష్యా, ఉక్రెయిన్‌కు వెళ్లే వారని.. ఇప్పుడు జిల్లాకో మెడికల్ వచ్చిందని హరీశ్ రావు అన్నారు.
Minister Harish Rao Comments On Congress : ధాన్యంతో పాటు వైద్యుల ఉత్పత్తిలోనూ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే విధంగా రాష్ట్రం ఎదిగిందని అన్నారు. రాష్ట్రంలోని అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్రం కాఫీ కొట్టి అమలు చేస్తోందని వివరించారు. ప్రతీ సంక్షేమ పథకం వెనక ఒక ఉద్దేశం ఉందని.. కేసీఆర్ కిట్ వల్ల ఆస్పత్రుల్లో సురక్షిత కాన్పులు పెరిగాయని అన్నారు. కల్యాణ లక్ష్మీతో బాల్య వివాహాలు తగ్గాయని వివరించారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో వందెకరాలు కొనే స్థితికి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే చెప్పారని కొనియాడారు.
"రాష్ట్రానికి స్ట్రాంగ్ లీడర్ కావాలో.. రాంగ్ లీడర్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి. తొమ్మిదేళ్లుగా తెలంగాణ స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ చేతిలో ఉన్నందు వల్లే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఎంబీబీఎస్ కోసం ఒకప్పుడు ఇక్కడి యువత చైనా, రష్యా, ఉక్రెయిన్ వెళ్లి చదువుకునేవారు. కాని ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంటూ ముందుంజలో ఉంది." -హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
Telangana Assembly Election 2023 : దేశమంతా ఏమవుతుందో అందరికీ తెలుసు.. కానీ తెలంగాణ అందుకు భిన్నంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు పేపర్ లీడర్ కావాలా లేకపోతే ప్రోపర్ లీడర్ కావాలా అని ప్రశ్నించారు. ఐటీ హబ్, మెడికల్ హబ్‌గా రాష్ట్రం ముందు వరుసలో ఉందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉందన్నారు. 60 లేదా 70 ఏళ్ల క్రితం ఒక నానుడి ఉండేది.. బెంగాల్ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేవారు. కానీ ఇప్పుడు ఆ మాటను తిరగరాస్తూ తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుచరిస్తోందనే నానుడికి వచ్చేశారన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు.