హైదరాబాద్లో రెస్టారెంట్లన్నీ హలీం వంటకాన్ని అందుబాటులోకి తెచ్చేశాయి. మొత్తం మీద నగరంలో హలీం మార్కెట్ 800 కోట్ల వరకు ఉంటుందని అంచనా ఉంది. అరబ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చిన ఈ వంటకం ఇప్పుడు ఎక్కువగా పాపులర్ అయింది. దీనిలో ప్రధానంగా ఉపయోగించే మాంసం కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్నట్లు హలీం తయారీదార్లు చెబుతున్నారు.
పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి:
కరీంగనర్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి మాంసం సేకరిస్తున్నప్పటికీ... అది సరిపోవడంలేదని హలీం అసోసియేషన్ అధ్యక్షులు మాజిద్ అంటున్నారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.
ఇవీ చూడండి: నోరూరించే 'చిరు' రొట్టెలు
డిజిటల్ చెల్లింపులే ఎక్కువ:
ప్రస్తుతం ఈ వంటకంపై 5 శాతం జీఎస్టీ ఉంది. గతంలో ఇది 14.5 శాతంగా ఉండేది. హలీం వ్యాపారస్తులు జీఎస్టీ ఎగ్గొడుతున్నారన్న విమర్శలున్నాయి. దీనిని హలీం ఉత్పత్తి దారులు ఖండిస్తున్నారు.ప్రస్తుతం ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువైనందున కార్డుల వినియోగం పెరిగిపోయిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. హైదరాబాద్లో నగదు వినియోగం తగ్గిపోగా.. డిజిటల్ మాధ్యమంలో జరిగిన చెల్లింపులకు పన్ను ఎగవేత అవకాశం లేదని అంటున్నారు.
30వేల మందికి ఉపాధి:
హలీం వ్యాపారంలో చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ ప్రత్యక్షంగా.. పరోక్షంగా 30 వేల మంది ఉపాధి పొందుతున్నట్లు ఈ సంఘం అంచనా వేస్తోంది.
ఇవీ చూడండి: ఇక్కడ జీసస్కు ఉర్దూ భాష వచ్చు !