Group 4 Exam Telangana 2023 Today : గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి పన్నెండున్నర వరకు జరిగింది. ఆలస్యం కారణంగా కొందరని.. సరైన పత్రాలు లేకపోవడంతో మరికొందరిని అధికారులు వెనక్కి పంపించేశారు. నల్గొండ జిల్లా చండూరులో మరియానికేతన్ పరీక్ష కేంద్రంలో ఒరిజినల్ ఆధార్ కార్డు లేకుండా జిరాక్స్ తెచ్చారని ఐదుగురిని సిబ్బంది బయటకు పంపించారు. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులనూ తిప్పి పంపారు.
హైదరాబాద్ మారుతీనగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలోకి ఒక అభ్యర్థి సెల్‌ఫోన్‌తో హాజరైనట్లు ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే ఫోన్‌ను జప్తు చేసుకొని మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. సదరు అభ్యర్థిని డీబార్ చేసి.. సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు.
Telangana Group 4 exam Today : గద్వాలలో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ డిగ్రీ కళాశాలలో మొదటి అంతస్తులో కిటికీ పక్కన కూర్చున్న అభ్యర్థి ఓఎమ్‌ఆర్ షీట్ గాలికి బయటకు ఎగిరిపడింది. సిబ్బంది తిరిగి అభ్యర్థికి అప్పగించారు. వనపర్తి నుంచి నాగర్‌కర్నూల్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గోపాల్‌పేటలో డీజిల్ లేక ఆగిపోయింది. ఈ బస్సులో బుద్ధారం కేంద్రంలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న అభ్యర్థులు సుమారు 40 మంది వరకు ఉన్నారు. బస్సు ఆగిపోవడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. ఇతర బస్సులు, ఆటోలు ఎక్కి వెళ్లి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో పోలీసులు మానవత్వాన్ని చాటారు. నరసింహులపేట మండలం గుండ్రాతిమడుగు పెద్ద తండాకు చెందిన జగ్గులాల్, సబిత దంపతులు ఇద్దరూ పరీక్షకు హాజరైన క్రమంలో వారి చిన్న పాపను అంగన్‌వాడీ టీచర్ సహాయంతో పోలీసుల సంరక్షణలో ఉంచి పరీక్షకు హాజరయ్యారు. ఈ క్రమంలో పాప ఏడుస్తుండగా పోలీసులు ఆ పాపను ఎత్తుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. రెండో పేపర్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంత వాతావరణంలో జరిగింది.
ఇవీ చూడండి..
High Court on GROUP-1 Prelims : 'పరీక్షల నిర్వహణలో కీలక అంశాలను ఎందుకు విస్మరించారు'