లాక్ డౌన్ సమయంలో ఉపాధి కరవై ఆకలికి అలమటిస్తున్న వలస కూలీలకు, దినసరి కూలీలకు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం తన వంతు సాయం అందించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, కార్యదర్శి గజ్జల విజయలక్ష్మి ఆధ్వర్యంలో కిరాణా సరకులు పంపిణీ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని గుడిసెల్లో నివసించే రెండు వందల మందికి బియ్యం, నిత్యావసర వస్తువులను అందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో తమ సంఘం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోందన్నారు. అందులో భాగంగానే పేదవారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని అధ్యక్షుడు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోన్న నేపథ్యంలో పేదలకు తమకు తోచిన సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణలో ఉండాలని కోరారు.