కొవిడ్ సమయంలోనూ కస్టమ్స్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయడాన్ని గవర్నర్ తమిళిసై కొనియాడారు. లాక్‌డౌన్ సమయంలో కూడా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడంలో కస్టమ్స్ విభాగం కీలకపాత్ర పోషించిందని అభినందించారు. కస్టమ్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కస్టమ్స్ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య, కస్టమ్స్ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కొవిడ్ సమయంలో వైద్యులు ఇతర శాఖలే కాకుండా కస్టమ్స్ అధికారులు కూడా ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో అక్రమంగా తరలించిన రూ.15 కోట్ల విలువగల బంగారు, విదేశీ కరెన్సీ పట్టుకున్నారని కొనియాడారు. హైదరాబాద్ నుంచి క్లోరోక్విన్ భారీగా ఎగుమతి అయిందని తెలిపారు. మెడికల్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి కావడం గర్వకారణమని చెప్పారు.
హైదరాబాద్ ఫార్మా రంగానికి రాజధాని. 150 దేశాలకు హైడ్రో క్లోరోక్విన్‌ను మన దేశం నుంచి ఎగుమతి చేయడం గర్వకారణం. కొవిడ్ వ్యాక్సిన్ దేశంలో తయారవుతోంది. ఇక్కడ ఇవ్వడంతోపాటు అభివృద్ధి చెందిన దేశాలకు టీకా సరఫరా చేస్తున్నాం. భారత్ సేవల్ని డబ్లూహెచ్‌ఓ ప్రశంసించింది. వ్యాక్సిన్‌ను రూపొందించడమే కాకుండా ఇతర దేశాలకూ ఇస్తున్నాం. ఇది దేశానికి ఎంతో గర్వకారణమైన సమయం. ఇందులో భాగస్వామ్యమైన కస్టమ్స్ అధికారుల్ని అభినందిస్తున్నా.
-తమిళిసై, గవర్నర్
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి జరిగిన ఎగుమతులు దిగుమతుల ద్వారా నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కస్టమ్స్ చీఫ్ కమిషర్ మల్లికా ఆర్య తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ రూ.4,500 కోట్ల రాబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్గో విభాగం నుంచి 30వేల టన్నులు ఎగుమతి కాగా 10వేల టన్నులు దిగుమతి అయినట్లు ఆమె వివరించారు. ప్రతిష్ఠాత్మకమైన కొవిడ్ వ్యాక్సిన్ తయారికి సంబంధించిన ముడిసరుకు దిగుమతి అయ్యేందుకు, భారత బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ఎగుమతికి కస్టమ్స్ విభాగం శక్తివంచనలేకుండా కృషి చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి : మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పీఆర్సీ నివేదిక