ప్రతి ఐదుగురిలో ఒకరు కొవిడ్ బాధితులుగా భావించుకుని.. మహమ్మారి మరింతగా ప్రబలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్.. హైదరాబాద్ రాజ్‌భవన్ అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, టీకాల కార్యక్రమం తీరు, నిర్ధరణ పరీక్షలు, పాజిటివ్, రికవరీ కేసుల సంఖ్య, లాక్ డౌన్ అమలు తీరును కార్యదర్శి సురేంద్రమోహన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ... కొవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. కొవిడ్ తీవ్రంగా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ పూర్తి బాధ్యతగా డబుల్ మాస్క్ ధరించడం, ఇతర నివారణ పద్ధతులను పాటించడం అత్యంత అవశ్యమని తమిళిసై అన్నారు.
రెండో దశలో అనేక మంది చిన్న పిల్లలు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్న గవర్నర్... చిన్నారుల పట్ల మరింత శ్రద్ధ వహించి వారు బాధితులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. సమష్టి కృషి, బాధ్యతతోనే ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలమని, ఆ దిశగా ప్రజలందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. డీఆర్డీఓ తయారుచేసిన 2-డీజీ యాంటీ కొవిడ్ ఔషధం సత్ఫలితాలను ఇస్తుందని తాను ఆశిస్తున్నానన్న తమిళిసై... కొవిడ్ చికిత్సలో గేమ్ ఛేంజర్‌గా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు