Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అస్థిత్వ పరిరక్షణ, వనరులు, అవకాశాల్లో న్యాయమైన వాటాను విధాన నిర్ణేతలు, నాయకులు, కష్టపడి పనిచేసే ప్రజలు గుర్తించారని అనుకుంటున్నట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజలకు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఉత్సాహంతో, గర్వంతో చేసుకునే వేడుకగా అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత చేసిన త్యాగాలతో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గవర్నర్ నివాళులర్పించారు.
‘‘ఆరు దశాబ్దాలకు పైగా సాగిన అవిశ్రాంత పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. యువత, విద్యార్థుల త్యాగాలతో సుధీర్ఘంగా సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జాతీయ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర సాధన తర్వాత ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి, పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోంది. అలుపెరుగని స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి కొనసాగుతూ ఓ శక్తిగా ఎదుగుతుంది’’ అని తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు.
8 ఏళ్లలోనే ఊహించనంత సంక్షేమం, అభివృద్ధి..: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తోందన్నారు. వివిధ రంగాల్లో తెలంగాణ గుణాత్మక అభివృద్ధి నమోదు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి జరిగిందని తెలిపారు. దీనికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న పురస్కారాలే సాక్ష్యమన్నారు.
8 ఏళ్లలోనే ఊహించనంత సంక్షేమం, అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. పరిశ్రమల మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర అభివృద్ధి దేశానికే పాఠమని సీఎం పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి నేడు దేశానికే పాఠం నేర్పుతోందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, ప్రజా సంక్షేమ పాలనను ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్రానికి సహకరించాల్సిన కేంద్రం.. ఆటంకం కలిగిస్తున్నా ముందుకు వెళ్తున్నామన్నారు. మొక్కవోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
ఇదీ చూడండి..