కొవిడ్ రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స విషయమై మరింత విస్తృతంగా పరిశోధనలు కొనసాగాలని... గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. లబ్ది, సామర్థ్యం, దుష్ప్రభావాలపై మరింత అధ్యయనం ద్వారా కరోనా రోగులకు ప్లాస్మా థెరపీ ప్రయోజనకరమా? లేదా? అన్నది తేలుతుందని అన్నారు. పుదుచ్చేరిలోని జిప్మర్, ఇందిరాగాంధీ వైద్యకళాశాల, హైదరాబాద్ ఈఎస్ఐ వైద్యకళాశాల, త్రిచ్చీకి చెందిన ఎంసీఆర్సీ నిపుణులతో నిర్వహించిన ఉన్నతస్థాయి చర్చాగోష్టిలో తమిళిసై పాల్గొన్నారు. ప్లాస్మా థెరపీ తీసుకున్న, తీసుకోని రోగులు వైరస్ నుంచి కోలుకోవడంలో పెద్దగా తేడా లేదని జిప్మర్ నిపుణులు పేర్కొన్నారు.
కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో ప్లాస్మా థెరపీని ప్రోటోకాల్ చికిత్సగా కొనసాగించకపోవడమే మేలని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, లాభనష్టాలపై మరింత విస్తృతంగా అధ్యయనం కొనసాగాలని అన్నారు. కొవిడ్ బారినపడ్డ వారికి ఏదీ అత్యుత్తమంగా ఉపయోగపడగలదో గుర్తించాల్సిన అవసరం ఉందని... ఆ దిశగా పరిశోధనలు కొనసాగి భవిష్యత్లో మంచి చికిత్స అవసరమని గవర్నర్ తమిళిసై అన్నారు. కరోనా వైరస్ సోకిన 72 గంటలు లేదా వారం రోజుల్లోపు ప్లాస్మా థెరపీ చేసిన వారిలో యాంటీబాడీలు బాగా వృద్ధి చెందినట్లు కొన్ని కేసుల్లో గుర్తించినట్లు ఈఎస్ఐ నిపుణులు, ఇతర ప్యానలిస్టులు తెలిపారు. కానీ కొవిడ్ రోగులందరికీ మొదట్లోనే ప్లాస్మా థెరపీ చేయడం మంచిది కాదని... ఎక్కువ భారంతో కూడుకున్నందున ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్.. పలుచోట్ల నిబంధనల ఉల్లంఘన