ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులను వెంటనే ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులను చేపడుతోందని గతంలోనే ఫిర్యాదు చేశామని... పనులు అక్కడ ఇంకా వేగంగా జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. పనులకు సంబంధించి ఛాయాచిత్రాలను కూడా ఫిర్యాదుతో జతపరిచారు.
కృష్ణా రెండో ట్రైబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ చట్టవిరుద్ఘంగా ఆర్టీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను ఆంధ్రప్రదేశ్ కొనసాగించడం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అడ్డుకోపోవడంపై ఇటీవల తెలంగాణ మంత్రివర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందని ఈఎన్సీ తెలిపారు. అక్రమంగా జరుగుతున్న కుడి కాల్వ విస్తరణ పనులను నిలువరించకపోతే తెలంగాణ కేటాయింపుల్లో సగం కూడా వచ్చే అవకాశం ఉండదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తక్షణమే ఆర్డీఎస్ కుడికాల్వ విస్తరణ పనులను నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని బోర్డును కోరారు.
ఇదీ చదవండి: AP Ministers on krishna: 'వారికంటే నాలుగు మాటలు ఎక్కువే మాట్లాడే కెపాసిటీ ఉంది'