రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ఓ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. మొత్తం 4,830 ఆరోగ్య ఉప కేంద్రాలను (సబ్ సెంటర్) ప్రభుత్వం పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దనుంది. గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా గ్రామగ్రామాన ఓ దవాఖానా ఏర్పాటు చేసి వైద్య సేవలను విస్తరించాలని నిర్ణయించింది. వీటిలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి వివిధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, మందులను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. ముందుగా ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్న గ్రామాల్లో వీటిని ప్రారంభించి.. దశలవారీగా ఇతర పల్లెల్లోనూ విస్తరించనుంది.
ప్రస్తుతం మండల పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. గ్రామీణులకు వైద్య సేవలు అందించడానికి ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్‌ఎంలే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక నుంచి ఉప కేంద్రాల్లోనూ వైద్యులను నియమించి వాటిని పల్లె దవాఖానాలుగా బలోపేతం చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన బస్తీ దవాఖానాలు రోగులకు వైద్య సేవలు సమర్థంగా అందిస్తున్నాయి. వీటి తరహాలోనే పల్లె దవాఖానాలనూ ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణ, నిర్వహణ నిధులను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎం) ద్వారా సమకూర్చుతారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి. ఒక్కో పల్లె ఆసుపత్రిలో ఒక వైద్యుడు, ఒక స్టాఫ్‌నర్సు/ఏఎన్‌ఎం, ఒక సహాయక సిబ్బంది ఉంటారు. వీటిలో సేవలు అందించడానికి ఎంబీబీఎస్ వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒప్పంద/పొరుగు సేవల విధానంలో నియామకాలను చేపడుతుండటంతో ఎక్కువ మంది వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం పీహెచ్‌సీల్లో, పల్లె దవాఖానాల్లో శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామాల్లో పనిచేసే వైద్యులను ప్రోత్సహించడానికి వీలుగా వారికి అదనపు వేతనాన్ని ప్రోత్సాహకంగా అందించాలని కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే సౌలభ్యాలను కనీసం కొంత మేరకైనా భర్తీ చేయడానికి ఈ అదనపు వేతన ప్రోత్సాహకం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. వీటి ఏర్పాటు, నిర్వహణపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైద్య వర్గాలు వివరించాయి.
సేవలు ఇలా..
- ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు
- ప్రాథమిక చికిత్స, మాతాశిశు సంరక్షణ సేవలు, టీకాల పంపిణీతోపాటు అధిక రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాల జబ్బులకు వైద్యసేవలు
- 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు. ప్రతి రోజూ ఇక్కడ సేకరించిన నమూనాలను సాయంత్రం జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు పంపుతారు. మరుసటి రోజు ఆ నమూనాల ఫలితాలు ఆన్‌లైన్‌లో నేరుగా పల్లె ఆసుపత్రులకు అందుబాటులోకి వస్తాయి.
- దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులతో పాటు ఇతర ఔషధాలూ అందజేస్తారు.
ఇదీ చదవండి: Nadu-Nedu:'నాడు-నేడు' బడులను ప్రజలకు అంకితం చేయనున్న ఏపీ సీఎం