పురఎన్నికల ప్రచారం ముగిసింది. ఒక్కరోజులో ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని నేతలు అవకాశమున్న ఏ మార్గాన్నీ వదులుకోవడం లేదు. సొంతూళ్లకు దూరంగా ఉంటున్న ఓటర్లను ఊళ్లకు రప్పించుకునేందుకు అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.
ఓట్ల కోసం టికెట్లు...
ఉపాధి కోసం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరులాంటి నగరాలకు వలసవెళ్లిన ఓటర్లకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసి పంపిస్తున్నారు. ప్రత్యర్థుల కంటే ముందే ఓటరును తమ ఖాతాలో వేసుకునేందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం ద్వారా డబ్బులు పంపించేస్తున్నారు. ట్రైన్ టిక్కెట్లు, ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసి వచ్చి ఓటేసి పొమ్మని బతిమాలుకుంటున్నారు. రాను పోను ఛార్జీలతో పాటు, భోజన ఖర్చులు, తాగినోళ్లకు తాగినంత మద్యం పోయిస్తామని వేడుకుంటున్నారు.
బహుమతులతో విన్నపాలు...
మహిళలకైతే ఖరీదైన చీరలు, బహుమతులు అందిస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థుల భార్యలు, ఆడపడుచులను రంగంలోకి దింపుతున్నారు. ప్రత్యర్థి ఇచ్చిన బహుమతుల కంటే ఎక్కువ ఇచ్చి ఎవరు డబ్బులిచ్చినా తీసుకొండి.. కానీ ఓటు మాత్రం నాకే వేయండని విన్నపాలు చేసుకుంటున్నారు. మూడు రోజులుగా ఇంటింటికీ మటన్, చికెన్, బిర్యానీ పొట్లాలు, లిక్కర్ పంచి పెడుతూ ఏ ఒక్క ఓటునూ చేజారిపోనీయకుండా... జాగ్రత్తపడుతున్నారు.
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఓటరు తనకే ఓటేస్తాడన్న నమ్మకం లేక ఆందోళన చెందటం అభ్యర్థుల వంతవుతోంది. తాయిలాలతో ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలన్ని అభ్యర్థుల ప్రయత్నం ఫలిస్తుందో లేదో... 25 తేదీ వరకు వేచిచూడాల్సిందే మరీ...!