గ్రేటర్ హైదరాబాద్‌లో హరితహారం కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. వెంటనే నాటేందుకు కోటి మొక్కలు జీహెచ్ఎంసీలో అందుబాటులో ఉండగా.. మరో కోటిన్నర మొక్కలను జీహెచ్ఎంసీ, జలమండలికి చెందిన ఖాళీ స్థలాల్లో నర్సరీల ద్వారా పెంచుతున్నారు. మరో 70 లక్షల మొక్కలను పెంచేందుకు హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డులకు చెందిన ఖాళీ స్థలాలను ఎంపిక చేశారు. గతేడాది మిగిలిన 10 లక్షలతో పాటు మొత్తం 3 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఉచితంగా మెుక్కల పంపిణీ
ఇళ్లలో పెంచుకునేందుకు ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రస్తుత హరితహారంలో మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని 3 వేల 84 ఖాళీ స్థలాలను అర్భన్ బయోడైవర్సిటీ అధికారులు ఎంపిక చేశారు. వీటితో పాటు జీహెచ్ఎంసీలో ఉన్న 873 పార్కుల్లో అందుబాటులో ఉన్న 696 ఎకరాల ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. గతంలో చనిపోయిన మొక్కల స్థానంలోనూ కొత్తవి నాటాలని నిర్ణయించారు.
కొత్తగా 47 మేజర్ పార్కుల నిర్మాణం
హరితహారంలో నాటిన మొక్కల మనుగడను నిరంతరం పర్యవేక్షించేందుకు జోనల్, సర్కిల్ స్థాయిలో ప్రత్యేక కమిటీలను జీహెచ్ఎంసీ ఏర్పాటుచేస్తోంది. నగరంలో కొత్తగా 47 మేజర్ పార్కుల నిర్మాణం చేపట్టాలని బల్దియా నిర్ణయించింది. పలు రకాల థీమ్‌లతో నిర్మించే ఈ పార్కులను హరితహారం పార్కులుగా వ్యవహరిస్తారు. ఈ పార్కులకు సంబంధించి ల్యాండ్‌స్కేప్ డిజైన్లు, డిజైన్ల తయారీ పురోగతిలో ఉన్నాయి. వీటితో పాటు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ద్వారా 17.75 కోట్ల రూపాయలతో సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్ బ్లాక్‌లలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను చేపట్టారు. జీహెచ్ఎంసీ ద్వారా నాటే మొక్కల పరిరక్షణలో కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ట్రీ గార్డ్‌లను అందజేయాలని జీహెచ్ఎంసీకి మహానగర పాలక సంస్థ విజ్ఞప్తి చేసింది.
ఇవీ చూడండి: సోమవారం చింతమడకకు సీఎం కేసీఆర్