Gandhi Jayanti Celebrations: గాంధీ జయంతిని పురస్కరించుకొని శాసనసభా ప్రాంగణంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మహత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో మహత్ముడి స్ఫూర్తితోనే పాలన సాగుతుందని వివరించారు. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే వారికి అమెరికా నుంచి ఆఫ్రికా వరకు నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని కొనియాడారు. దేశంలో అధికారం కోసం విద్వేషాలు రెచ్చగొట్టే వారి కుట్రలను తిప్పికొట్టేందుకు గాంధేయవాదులంతా ఏకం కావాలని రేవంత్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గాంధీ ఆశయాలు నేరవేర్చడానికి మోదీ సర్కార్ కృషి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
బాపూజీ ఆదర్శాలు, భావజాలం గతంలో కంటే ఇప్పుడే మరింత అవసరం ఉందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. మహాత్ముడి సూక్తుల్ని ఆయన పోస్ట్ చేశారు. హైదరాబాద్ బాపుఘాట్‌లో మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి గాంధీజీకి నివాళులర్పించారు. హైదరాబాద్ కొండాపుర్ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ కార్యక్రమానికి ఎంపీ సంతోష్‌కుమార్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హాజరయ్యారు.
బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి రాజ్యసభ నిధులనుంచి రూ.10 లక్షలు అందిస్తానని ఎంపీ సంతోష్ అన్నారు. ఖమ్మం గాంధీచౌక్‌లో మహాత్ముడి విగ్రహానికి రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాళులర్పించారు. వరంగల్‌లో చీఫ్ విప్ వినయభాస్కర్ , తెరాస ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. భువనగిరి గాంధీ పార్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మహాత్ముడికి నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఎస్బీఐ ఆధ్వర్యంలో సైక్లింగ్, వాకింగ్ నిర్వహించారు. బ్యాంకు ఉన్నతాధికారులు,సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవీ చదవండి: కేసీఆర్ జాతీయ పార్టీకి కుదిరిన ముహూర్తం.. ఆ పేరు వైపు మొగ్గు
'ఖర్గేతో మార్పు సాధ్యం కాదు'.. ముఖాముఖి చర్చకు శశిథరూర్ డిమాండ్!