Former MLA Jagga Reddy went to Delhi : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన దిల్లీ బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, తాజా రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ఇద్దరే ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలు, ప్రభుత్వ పాలన, ప్రజల్లో వస్తున్న స్పందన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి (Jaggareddy) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే కాంగ్రెస్ తరఫున గట్టిగా గళం వినిపించే నాయకుల్లో జగ్గారెడ్డి కూడా ఒకరని చెప్పొచ్చు. ఎమ్మెల్యే కాకపోవడంతో ప్రతిపక్షాలు చేసే విమర్శలపై ఎదురుదాడి చేసేందుకు తనకు హోదా తగినంతగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రిని కలవడం, ఈరోజు దిల్లీ ప్రయాణం కావడంతో పార్టీలో పలు అంశాలపై చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే, ప్రతిపక్ష ఆరోపణలకు దీటుగా స్పందించగలరని, అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన హస్తిన బాట పట్టడం విశేషం.
'బలవంతుడి టైం అయిపోయే దాక బలహీనుడు సైలెంట్‌గానే ఉంటాడు' - జగ్గారెడ్డి చెప్పిన కథ వింటారా
Jagga Reddy Fires On BRS : ఇటీవలే బీఆర్ఎస్ పార్టీపై (Jagga Reddy Fires On BRS) జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే హామీల అమలుపై భారత్ రాష్ట్ర సమితి నేతలు విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. పది రోజులకే ప్రభుత్వంపై విమర్శలు చెయ్యడం సబబు కాదని హితవు పలికారు. పేద ప్రజలను ఆదుకోడానికి సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారని, ప్రజలు నమ్మారు కాబట్టే అధికారాన్ని కట్టబెట్టారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగేవి కావు : బస్సులో మహిళలు ప్రయాణించట్లేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో హరీశ్‌రావు, కేటీఆర్ రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఎప్పుడూ లగ్జరీ కారుల్లో తిరుగుతారని, ఆర్టీసీ బస్సుల్లో తిరగరు కాబట్టే ఈ పథకం విలువ వాళ్లకేమీ తెలియదని వ్యంగాస్త్రాలు సంధించారు. తాను అసెంబ్లీలో ఉండి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగేవి కావని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
న్యూలుక్‌లో ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం
ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం : ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన 48 గంటల్లో రెండు పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, ఈ పథకంతో పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులమయం చేసిందని జగ్గారెడ్డి ఆరోపించారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్‌ను మరవద్దు : జగ్గారెడ్డి