రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వివిధ పార్టీల ప్రధాన కార్యలయాల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు పాల్గొని జాతీయ గీతాలాపాన చేశారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు:
గాంధీభవన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సోనియాగాంధీ వల్లే రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలోరాష్ట్రం అప్పుల పాలైందని ఆక్షేపించారు. రాష్ట్రంలో తెరాసను ఓడించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ధీమా వ్యక్తం చేశారు.
భాజపా రాష్ట్ర కార్యాలయం:
భాజపా రాష్ట్ర కార్యాలయంలో... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగడంలేదని విమర్శించారు. నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ నుంచి విముక్తి కోసం మరో పోరాటానికి భాజపా సిద్ధమన్నారు. తెరాస పాలనలో నిరుద్యోగుల ఆశలు వమ్ము అయ్యాయన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్:
ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన అవతరణ వేడుకల్లో తెదేపా నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తెదేపా ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు.
తెజస పార్టీ కార్యాలయం:
హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రం ఏ ఒక్కరి వల్లనో రాలేదని సకల జనుల పోరాటం వల్లే సిద్ధించిందని అన్నారు. ఐదేళ్లలో తెరాస ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను విస్మరించిందని మండిపడ్డారు. విభజన హామీలు ఇంత వరకు నెరవేరలేదని... రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయం:
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికైన కమ్యూనిస్టులు ఏకమై మతోన్మాదానికి చరమగీతం పాడాలని నారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణను కేసీఆర్ ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లో ఆయా నేతలు తెలంగాణ ఆవిర్భవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇదీ చూడండి: అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..