Fire accident at Swapnalok Complex : హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలే వేసవికాలం ఎక్కడ ఎప్పుడు అగ్నిప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందతున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న దక్కనమాల్ అగ్నిప్రమాద ఘటన మరవకముందే తాజాగా నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
మహంకాళీ పీఎస్ పరిధిలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ భవనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ మూడో అంతస్తులో చెలరేగిన మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చీకటిగా ఉండడంతో లైట్లు వేసుకుని సిబ్బంది నివారణ చర్యలు చేపడుతున్నారు. భవనం లోపల కొందరు చిక్కుకున్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది చర్యలు వేగవంతం చేశారు. టార్చ్ లైట్ల వెలుతురులో భవనంలోకి వెళ్లారు. ఇప్పటికే భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు క్రేన్ తెప్పించి సహాయక చర్యలు మొదలుపెట్టారు.
స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో మంటలు తీవ్రత పెరుగుతోంది. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు సమీప ఇళ్లలలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. కాంప్లెక్స్‌లోని ఐదో అంతస్తులో మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడినట్లు తెలిపిన అధికారులు.. మరో ఐదుగురిని సిబ్బంది కాపాడారు. ఈ ఐదుగురు బాధితులు స్పృహతప్పి పడిపోయి ఉండడంతో గుర్తించిన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్పృహతప్పి వారిలో నలుగురు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. భవనం నుంచి ఇప్పటివరకు 11 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ కాంప్లెక్స్‌లో మెుత్తం ప్రైవేటు కార్యాలయాలున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కాంప్లెక్స్ రెండో వైపు ఉన్న కార్యాలయాల్లో నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లో కొంతమంది ఉద్యోగులు ఇరుక్కుపోయినట్లు సమాచారం. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనం లోపల ఎంతమంది ఉన్నారనే సమాచారం తెలియాల్సి ఉంది. దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొెంటున్నారు.
ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి తలసాని : విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలికి ప్రమాదానికి కారణమైన పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రి తలసాని పరిశీలించారు. భవనం లోపలి నుంచి ఇప్పటివరకు ఏడుగురిని రక్షించారని తెలిపారు. లోపల ఎంతమంది ఉన్నారో ఇంకా స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఎప్పుడూ రద్దీగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: