హైదరాబాద్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఆర్కేడ్ ఫర్నీచర్‌లో ఉదయం 6 గంటల సమయంలో మంటలు ఆరంభమయ్యాయి. గృహోపకరణాల దుకాణం అయినందున మంటలు వేగంగా వ్యాపించాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే పొగ భవనం మొత్తం కమ్ముకుంది. బిల్డింగ్ కింద ఉన్న బిగ్‌సీ, లాట్ మొబైల్స్ స్టోర్స్‌లలో కూడా పొగలు కమ్ముకోగా... అప్రమత్తమైన సిబ్బంది సెల్ఫోన్లను ముందుగానే బయటకు తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే పనిలో పడ్డారు. అగ్నికీలలు మరింత వేగంగా విస్తరించడం వల్ల మరో రెండు వాహనాలను రప్పించారు. భవనంలో వ్యాపించిన పొగ బయటకు వెళ్లేందుకు షోరూంకు బిగించిన అద్దాలను పగలగొట్టారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేనని అధికారులు భావిస్తున్నారు.
ఆర్కేడ్ ఫర్నీచర్ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అదే భవనంలో ఉన్న బిగ్‌సీ, లాట్ మొబైల్స్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు.
ఇదీ చూడండి: కశ్మీర్లో మరో నలుగురు ముష్కరులు హతం