కరోనా విజృంభిస్తున్న వేళ హైదరాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త వ్యవస్థ ఏర్పా టు కు శ్రీకారం చుట్టింది. విమానాశ్రయానికి వచ్చిపోయే వాహనాల పార్కింగ్ చెల్లింపులకు స్పర్శ రహిత(కాంటాక్ట్ లెస్) విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో కార్ పార్కింగ్‌ను ఫాస్టాగ్ జారీ చేసే అన్ని బ్యాంకులను అనుసంధానం చేశారు. విమానాశ్రయానికి వచ్చిపోయే వాహనదారులు వేటిని తాకకుండా సురక్షితంగా పార్కింగ్ రుసుము చెల్లించే వీలుంది.
ఈ విధానంలో వాహనదారులు ఫాస్టాగ్ ప్రీపెయిడ్ అకౌంట్ లింక్ ఉన్న ఎన్ఈటీసీ ఫాస్టాగ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. ట్యాగ్‌ను వాహనం కిటికీ అద్దం కింద అమర్చుకోవాలి. లోపలికి ప్రవేశించే సమయంలో ఫాస్టాగ్ గేట్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ని నమోదు చేస్తుంది. తిరిగి బయటకు వెళ్లే సమయంలో స్కానింగ్ ద్వారా ఆ వాహనదారుడి ఖాతా నుంచి రుసుము నగదు బదిలీ అవుతుంది. వివరాలు నమోదైన ఫోన్ నంబరుకు ఈ మేరకు సందేశం వస్తుంది. ప్రస్తుతం కౌంటర్ ద్వారా నేరుగా చెల్లించే విధానం కొనసాగుతున్నప్పటికీ వాహనదారులు భద్రత కోసం ఫాస్టాగ్ మార్గాన్నే వినియోగించాలని జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రతీప్ ఫణికిరణ్ సూచించారు.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్