జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన వివిధ నీటిపారుదల ప్రాజెక్టు పనుల పూర్తికి గడువు పొడిగించారు. పలు కారణాలతో ఆలస్యమైన పనుల పూర్తి కోసం గడువు పెంచారు. భూసేకరణ, సహాయ, పునరావాస చర్యల్లో ఆలస్యం, పనుల స్వరూపంలో మార్పులు, ఇతర కారణాల వల్ల ఆలస్యమైన పనుల పూర్తికి అవకాశం ఇచ్చారు.
కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎస్సారెస్పీ రెండో దశ, ఎల్లంపల్లి, కోయిల్ సాగర్, వరదకాల్వ, ఏఎమ్మార్పీ, ఎస్సెల్బీసీ సొరంగం, కుమురం భీం ప్రాజెక్టులకు చెందిన 61 ప్యాకేజీల పనుల గడువును పొడిగించారు. గతంలో జారీ చేసిన 146వ జీఓలోని అంశాలు ఈ పనులను వర్తించనున్నాయి. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మరో రూ. లక్షా పదివేల కోట్లు అవసరమవుతాయి. అందులో 90 శాతానికి పైగా నిధులను 5 ప్రాజెక్టుల్లో ఖర్చు చేయాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, డిండి ఎత్తిపోతల పథకాలకే రూ. 98 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేసిన కేటాయింపులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పట్టనుంది.
ఇదీ చూడండి: KTR: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం