Science Day Celebrations in Dilsukhnagar: వైజ్ఞానిక ప్రదర్శన చిన్నారుల సృజనాత్మకతను వెలికితీస్తోంది. మట్టి లేకుండా తక్కువ నీటితో మొక్కల పెంపకం.. సెన్సర్ల సాయంతో అంధులకు దారి చూపే చేతి కర్ర.. అంతరిక్షంలో ఉండే శకలాలను తొలగించే హైడ్రాలిక్ ర్యాంప్ పంపు.. ఇంటిని దొంగల నుంచి కాపాడే హైటెక్ లేజర్ భద్రతా వ్యవస్థ.. ఇలా పదుల సంఖ్యలో వైజ్ఞానిక ప్రాజెక్టులు కొలువుదీరాయి. చిట్టి బుర్రల్లో చిగురించిన ఆలోచనలు అద్భుత నమూనాలుగా ఆవిష్కృతమయ్యాయి.
ఈరోజు దిల్‌సుఖ్‌నగర్ జోన్‌లోని వనస్థలిపురం నారాయణ పాఠశాలలో యంగ్ సైంటిస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరిట ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా అలరించింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైజ్థానిక ప్రదర్శనలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని అబ్బురపరిచే వైజ్ఞానిక నమూనాలను ప్రదర్శిస్తూ ప్రతిభ చాటారు.
ఈ వైజ్ఞానిక ప్రదర్శనను నారాయణ గ్రూపు సంస్థల ఏజీఎం హేమాంబర్, ఆర్టీ రవిలు ముఖ్యఅతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి హేమాంబర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. పరిశోధనల్లో ఉత్సాహంగా వ్యవహరిస్తూ శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుతున్నారు.
అబ్బుర పరిచిన నమూనాలు..: ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను బృహతి ఆసక్తిగా తిలకించారు. వాటికి సంబంధించిన విశేషాలను చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రంతోపాటు కంప్యూటర్, హోం సైన్స్ విభాగాల్లో రూపొందించిన పరికరాలు, నమూనాలు, వాటి పనితీరును విద్యార్థులు వివరించారు. కంప్యూటర్ రంగంలో మెటావర్స్ సాంకేతికతపై నేటితరం ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తోందని తెలిపారు. లేని వ్యక్తిని ఉన్నట్లుగా సృష్టించే ఈ గేమింగ్ ప్రక్రియ ద్వారా ఇంట్లో కూర్చునే ఫిజికల్ ఫిట్‌నెస్‌ను అభివృద్ధి చేసుకోవచ్చని విద్యార్థులు వివరించారు. వైఫైని రీప్లేస్ చేసే లైఫై యాప్‌ని సృష్టించారు.
ఆధునిక రంగుల హరివిల్లు ఆవిష్కరణ: ఓట్స్‌తో తయారుచేసిన బలవర్థకమైన పిజ్జా, మంచి పోషకాలుండే పన్నీర్ ఫ్రాంకీస్, తక్కువ ధరలో తయారయ్యే హెర్బల్ కాస్మొటిక్ వస్తువులను ప్రదర్శించారు. ఇంట్లోని తడి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువులను తయారుచేసి మొక్కలకు ఉపయోగించడంపై వివరించారు. ఫొటోగ్రఫీలో వస్తున్న ఆధునిక రంగుల హరివిల్లును ఆవిష్కరించారు. మట్టిలో కలిసిపోయి.. వాటిని మళ్లీ ఉపయోగించి ఉత్సవ విగ్రహాలను తయారుచేసేలా.. రూపొందించిన పాలీమర్ నమూనాల ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో నారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.భవానీ, శ్రీదేవి, చైతన్య, జీన్ స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: