సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మున్సిపల్ కమిషనర్లతో నేడు నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 'ప్రతి ఆదివారం-పది గంటలకు-పదినిమిషాలు' పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి.. దోమల నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం తమ ఇళ్లలోనే ఉండి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
మరోవైపు ఆస్తిపన్నుపై 5 శాతం ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వార్షిక ఆస్తిపన్ను కేవలం రూ.30,000 వరకు ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను ఎంత ఉన్నప్పటికీ.. మే 31లోపు పన్ను చెల్లిస్తే 5 శాతం ప్రోత్సాహకం ఇస్తారు. గృహాలతో పాటు కమర్షియల్ కేటగిరీల వారికీ ఈ ఎర్లీబర్డ్ ప్రోత్సాహకం వర్తించనుంది.