Dialysis Issues in Telangana: యంత్రంలో ఏ చిన్న భాగం పాడైనా అది పని చేయదు. మనిషి శరీరం కూడా అంతే. ఏ అవయవం పని చేయకున్నా ఆ ప్రభావం శరీరం మీద అంతా పడుతుంది. ముఖ్యంగా కీలక అవయవాలు పాడైతే అది ప్రాణాలకే ప్రమాదం. అలాంటి అవయవాల్లో కీలకమైనవి కిడ్నీలు. మనిషి దేహంలో అధికంగా ఉన్న హానికారకాలు, ద్రవాలను, రక్తాన్ని వడపోసి శరీరం నుంచి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి కిడ్నీలు. రోజుకి దాదాపు 30 నుంచి 50 సార్లు కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
ఒక్కసారి కిడ్నీలు పని చేయటం మానేస్తే మాత్రం.. రక్తంలో హానికారకాలు, లవణాల శాతం పెరిగి మనిషి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే కిడ్నీలు పాడైపోయిన వారి శరీరం నుంచి రక్తాన్ని బయటకు తీసి శుద్ధి చేసి తిరిగి రక్తాన్ని శరీరంలోకి పంపిస్తుంటారు. ఈ ప్రక్రియనే డయాలిసిస్‌గా వైద్యులు చెబుతారు. భారత్‌లో డయాలిసిస్ భారిన పడుతున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. దేశంలో ఏటా అదనంగా 5 లక్షల మంది డయాలిసిస్ రోగులు చేరుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
డయాలిసిస్ రెండు రకాలు: ఈ కిడ్నీ ఫెయిల్యూర్ 2 రకాలుగా ఉంటుందని వైద్యులు చెబుతారు. ఒకటి తాత్కాలికం కాగా, మరొకటి పూర్తిగా కిడ్నీ దెబ్బతినటం. మధుమేహం, బీపీ, ఆటోఇమ్యూన్ డిసీజ్, జన్యు పరమైన సమస్యలు ప్రధానంగా మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బ తినేందుకు దారి తీస్తాయి. డయాలిసిస్ విషయానికొస్తే ఇది 2 రకాలుగా ఉంటుంది. హీమో డయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిస్. ఇందులో ఎక్కువగా ఉపయోగించేది మాత్రం హీమో డయాలిసిసే. దీనికోసం రోగి దగ్గర్లోని డయాలిసిస్ కేంద్రానికి వెళ్లి.. రక్తశుద్ది చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక్క డయాలిసిస్ సెషన్‌కు 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది.
ఇందులో భాగంగా రోగి శరీరంలోని రక్తం మొత్తాన్ని క్రమంగా శరీరం నుంచి బయటకు తీసి యంత్రాల సాయంతో శుద్ధి చేసి తిరిగి శరీరంలోకి పంపిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరికి వారానికి 3 సార్లు సైతం రక్త శుద్ది చేయాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పెరిటోనియల్ డయాలిసిస్ ఇందుకు భిన్నం. ఈ పద్ధతిలో రోగి శరీరంలోకి చిన్న పైప్ వంటి దానిని ప్రవేశపెట్టడం ద్వారా శరీరం లోపలే రక్తం శుద్ది జరిగేలా చేస్తారు. పొత్తి కడుపు భాగంలో ఉండే చర్మం ఇందులో ఫిల్టర్‌గా పని చేసి రక్తాన్ని శుద్ది చేస్తుంటుంది. ఈ విధానంలో రోగికి సుమారు 3 సార్లు శరీరంలో రక్తాన్ని శుద్ది చేసే అవకాశం ఉంటుంది.
Dialysis centers: ఇటీవలి కాలంలో తెలంగాణలో డయాలిసిస్ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరగటంతో రోగులకు కాస్త ఊరట లభించినట్లైంది. డయాలిసిస్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నడుం బిగించిన సర్కారు.. రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2014 నాటికి రాష్ట్రంలో కేవలం 3 డయాలిసిస్ కేంద్రాలు ఉండగా.. ఇప్పటికే ఆ సంఖ్యను 83కి పెంచింది. గత 8 ఏళ్లలో సుమారు రూ.700 కోట్లను డయాలసిస్ రోగుల కోసం ఖర్చు చేసినట్టు స్పష్టం చేసింది.
ఆరోగ్యశ్రీలో భాగంగా సింగిల్ యూజ్ ఫిల్టర్ డయాలిసిస్ సౌకర్యాన్ని సైతం కల్పించటం విశేషం. ఈ విధానంలో ఒకరి నుంచి మరొకరికి ఇన్‌ఫెక్షన్లు రాకుండా డయాలిసిస్ సేవలను అందించే సౌకర్యం కల్పించినట్టైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12వేల మంది డయాలిసిస్ రోగుల్లో 10 వేల మందికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డయాలిసిస్ సేవలు అందిస్తున్నట్టు ఇటీవల సర్కారు ప్రకటించింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఒక్కసారి శాశ్వత డయాలిసిస్ అవసరమైతే.. కిడ్నీ మార్పిడీ మాత్రమే పరిష్కారమని వైద్యులు చెబుతున్నారు. రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ వ్యాధి బారిన పడకుండా చూసుకోవటం అత్యంత ముఖ్యమైన విషయంగా వివరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటంతో పాటు కిడ్నీలో రాళ్ల వంటి సమస్య ఉన్న వారు తప్పక వైద్యులను కలిసి తగు సలహాలు సూచనలు పాటించాలని కోరుతున్నారు. ఫలితంగా కిడ్నీలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
ప్రెగ్నెన్సీని ఏ తేదీ నుంచి లెక్కించాలి? డాక్టర్లు ఏమంటున్నారు?