Political Heat in Telangana : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి రంజుకుంటోంది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, బహిరంగ సభలతో క్యాడర్‌ను జనంలోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు సచివాలయంలో వరుస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాన ప్రతిపక్షాలు అయిన బీజేపీ, కాంగ్రెస్ తమతమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
Etela Rajender Sensational Comments : ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ చేరికలపై దృష్టిసారించాయి. ప్రధానంగా బీఆర్‌ఎస్ నుంచి బహిష్కృతమయిన నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో చేరాలంటూ చర్చలు జరుపుతున్నాయి. దాంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వారిద్దరూ ఏ పార్టీలో చేరుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్న వేళ.... హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత, ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Etela Rajender Meet Ponguleti and Jupally : బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లికి ఈటల ఆహ్వానం
పొంగులేటి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరటం కష్టమేనని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ వారిద్దరితో మాట్లాడుతున్నట్టు చెప్పిన ఈటల.... వారు తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే వారిని ఆపగలిగానని... బీజేపీలో చేరటానికి వారికి భౌతికంగా ఇబ్బందులు ఉన్నట్టు ఈటల తెలిపారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు, తెలుగుదేశం సహా అన్ని పార్టీలుంటాయని ఈటల పేర్కొన్నారు. అయితే ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉందని.. బీజేపీ లేదని వ్యాఖ్యానించారు.
ఖమ్మం ఇప్పటికీ సిద్దాంతపరంగా.... కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న జిల్లా అని ఈటల రాజేందర్ వివరించారు. దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ అని ఆయన అన్నారు. ప్రియాంకగాంధీని అప్పట్లో పొంగులేటి కలుస్తారని తెలిసిందన్న ఆయన.. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చించానని పేర్కొన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ చేసిన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే ఈటల చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి, జూపల్లి కృష్ణారావు ఏ విధంగా స్పందిస్తారనే ఉత్కంఠ రాజకీయ శ్రేణుల్లో నెలకొంది.
పొంగులేటి, జూపల్లి సమాలోచనలు: మరోవైపు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన అడుగు కావడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఇద్దరూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నాయకులు, అనుచరులతో సమావేశమవుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... బీఆర్ఎస్ పార్టీని బలంగా ఎదుర్కొనే పార్టీతో పాటు రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి :