Election Observers in Telangana 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఆయా నియోజకవర్గాల్లో ఈ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు.
39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను వారు పర్యవేక్షిస్తారు. సాధారణ పరిశీలకులు, ఎన్నికల పరిశీలకులు నవంబర్ 10వ తేదీ నుంచి రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే 60 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఈసీ నియమించింది. నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రారంభంతో వ్యయ పరిశీలకులు శుక్రవారం నుంచి విధులు చేపట్టనున్నారు.
ECI Review on Telangana Polling Arrangements 2023 : మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఆయారాష్ట్రాలు, వాటిసరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో...సీఈసీ,ఇతర కమిషనర్లు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర ప్రధాన ఎన్నికలఅధికారి వికాస్‌రాజ్ పాల్గొన్నారు. ఓటింగ్ రోజు సరిహద్దుల్లో ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేయాలని అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అదేశించారు.
Telangana Assembly Election Polling Arrangements 2023 : రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా ఉందని...శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సీఈవోకు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇప్పటికే సరిహధ్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో నిఘా పెంపుతో 385 కోట్ల మేర నగదు జప్తు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 17 సరిహద్దు జిల్లాల్లో 166 సరిహద్దు చెక్‌పోస్టులు.. పొరుగురాష్ట్రాల సరిహద్దుల్లో 154 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయానికి డీజీపీ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించినట్లు వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని.. నేరకార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్లు డీజీపీ అంజ నీకుమార్ తెలిపారు. ఇప్పటివరకు 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.