మినీ పుర ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా నిర్వహిస్తుందని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ ప్రశ్నించారు. 12.5 లక్షల మందిని రిస్క్‌లో పెట్టి ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే... ఎన్నికల సంఘం అదే చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తానా అంటే ఎన్నికల సంఘం తందానా అంటోందని విమర్శించారు.
కొత్తూరు మున్సిపల్ కమిషనర్‌కు కూడా కరోనా వచ్చిందని సమాచారం ఉండగా... రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి వచ్చిందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా ఇంత తీవ్రంగా ఉన్నా... ఎన్నికలను నిర్వహించాలని సూచించడం ఏంటని ప్రశ్నించారు. ఈ నెల 30 నాటికి కరోనా కేసులు మరింత విజృంభించే అవకాశం ఉందని ఆయన ఆవేదన చెందారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించడం లేదంటున్న ఎన్నికల సంఘం... మరి ఎన్నికల కమిషనర్ ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా జరిగితే అందుకు ఎన్నికల కమిషనర్ పార్థసారథే బాధ్యుడని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'పీఎం, సీఎం ఎన్నికలపై మాత్రమే దృష్టి పెట్టారు'