Election Campaign in Hyderabad : హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 44,42,458 ఓటర్లు ఉన్నారు. 22,79,581 పురుషులు, 21,62,577 స్త్రీలు, 300 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 15 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు.. ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు ప్రచారంలో ముందున్నారు. నిత్యం ప్రజల్లో ఉండటం, మంచిచెడుల్లో జనానికి సాయం చేయడం, సమస్యల పరిష్కారం, డిగ్రీ కళాశాల నిర్మాణం, అడ్డగుట్టలో 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవడం పద్మారావుకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే.. ఆయన కుమారులు నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారనే విమర్శలు కొంత ప్రతికూలతను చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Political Heat in Hyderabad : సికింద్రాబాద్‌లో ముస్లింల ఓట్లు 47 వేలు, క్రిస్టియన్ ఓట్లు 24 వేలు సహా రైల్వే ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోశ్.. తనకు అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి బరిలోకి దిగుతున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత, కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెల బరిలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు తమ తండ్రి పేరుతో ప్రచారం చేస్తున్నారు. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. గద్దర్ కుమార్తె వెన్నెల.. సాయన్న కుమార్తె లాస్య నందితకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఐతే.. రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో సాయన్న హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ప్రచారం చేయడంతో.. లాస్య నందితకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.
కీలకంగా మారనున్న వలసదారుల ఓట్లు : సనత్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ నుంచి కోట నీలిమ, బీజేపీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా రెండు పడక గదుల ఇళ్లు, రహదారులు, కల్వర్టులు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు తలసానికి కలిసొచ్చే అవకాశం ఉంది. గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారులు, ఉత్తరాది ఓటర్లు కీలకంగా మారనున్నారు. 2018 ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో గెలిచిన తలసానికి.. ఆ తర్వాత వచ్చిన ఎంపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
Congress Candidate in Nampally : నాంపల్లి నియోజకవర్గంలో మజ్లిస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ఉండగా.. ఈసారి ఆయనకు టిక్కెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్.. పతంగి పార్టీకి గట్టి పోటీనిస్తున్నారు. రెండు పార్టీల విజయావకాశాల్ని పోలింగ్ శాతం నిర్ణయిస్తుందని అంటున్నారు. మజ్లిస్‌ను గెలిపించినప్పటికీ.. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్, ఇరుకు రోడ్ల వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదనే స్థానికులు చెబుతున్నారు.
ఇంటింటికి తిరుగుతూ మహమ్మద్ అజారుద్దీన్ ఎన్నికల ప్రచారం
డ్రైనేజీ సమస్యలు ప్రతికూలంగా మారే అవకాశం : ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. దానం నాగేందర్, విజయారెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంటున్నారు. డ్రైనేజ్ సమస్యలు, వర్షకాలంలో హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్, ఎంఎస్ మక్త వంటి ప్రాంతాల్లో వరద నీటి కష్టాలు దానం నాగేందర్‌కు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, బీజేపీ నుంచి పూస రాజు పోటీ పడుతున్నారు. జీవో నెంబర్ 58, 59 సమస్యలు, డ్రైనేజీ ఇక్కట్లు ముఠా గోపాల్‌కు ప్రతికూలంగా మారే ఉంటుందని అంటున్నారు.
Amberpet MLA Candidates 2023 : అంబర్‌పేట్ నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు కీలకంగా ఉన్నారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌పై స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు బీఆర్ఎస్ తరఫున బరిలో ఉండగా.. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన రోహిన్‌రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. స్థానికేతరుడు అనే అంశం రోహిన్‌రెడ్డికి ప్రతికూలంగా ఉంది. మూసీ పరివాహకంలో నాలాల విస్తరణ, అభివృద్ధి పనులు కాలేరు వెంకటేశ్‌కు కలిసి వస్తున్నా.. స్థానిక బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు.. ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మాజీ మంత్రి కృష్ణయాదవ్‌కు దక్కింది.
BJP Janasena Alliance Issue 2023 : జనసేనతో బీజేపీ పొత్తు.. కాషాయ నేతలకు తలనొప్పి తెస్తోందిగా..?
మైనార్టీ, యువత ఓట్లపై దృష్టి : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ హోరాహోరీ తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి సై అంటున్నారు. పేరుకే సంపన్నులు ఉండే నియోజకవర్గమైనా.. పేదల బస్తీలే ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా లక్షా 40 వేల మంది ఉన్న మైనార్టీ ఓటర్లు సహా మధురానగర్, బోరబండ, శ్రీనగర్ కాలనీలో సెటిలర్స్ కీలకం కానున్నారు. తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని మాగంటి గోపీనాథ్ ధీమాగా ఉండగా.. మైనార్టీ, యువత ఓట్లపై కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్(Congress candidate Azharuddin) ఆశలు పెట్టుకున్నారు. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఆరింటిలో మజ్లిస్ సత్తా చాటుతోంది. గోషామహల్ నియోజవర్గంలో మాత్రం బీజేపీ గెలుస్తూ వస్తోంది.
గోషామహల్‌లో హ్యాట్రిక్ వస్తుందా : ఎంఐఎం ఈసారి కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మారుస్తుందని సమాచారం. యాకుత్‌పుర ఎమ్మెల్యే పాషాఖాద్రి, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను మారుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మిగతా స్థానాల్లో సిట్టింగ్‌లకే ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపు బావుటా ఎగురవేస్తాననే దీమా అక్భరుద్దీన్ ఓవైసీలో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ఇంకా గోషామహల్ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి సునీతారావు పోటీ చేస్తున్నారు. గోషామహల్‌లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పట్టుదలలో ఉన్నారు. పాతబస్తీలో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
MLA Raja Singh on BJP Ticket : 'నా ప్రాణం పోయినా.. బీఆర్ఎస్/ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లను'