పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా ఈ చిన్నారి తన ప్రతిభను చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం చేస్తోంది. శర్మ, శైలజల కుమార్తె సహృద... హైదరాబాద్ మారేడ్‌పల్లిలోని గీతాంజలి పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. తన చేతలతో నాలుగు నెలల వయసు నుంచే ఎందరినో ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు తన ప్రతిభతో పాటు పలు ముఖ్యమైన సందేశాలను సమాజానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఎలైట్ ప్రపంచ రికార్డ్స్ వారి సమక్షంలో మూడు ప్రపంచ రికార్టులు నెలకొల్పింది. కాగితాలతో గంటలోనే 100 వివిధ ఆకృతుల్లో బొమ్మలు తయారు చేసి రికార్డు నెలకొల్పింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. ఐదు గంటలపాటు పలురకాల డ్రాయింగ్లను వేసి మరో రికార్డు నమోదు చేసింది. పర్యావరణాన్ని కాపాడాలన్న సందేశాన్నిస్తూ ఈ ప్రక్రియ పూర్తి చేసింది. అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించేందుకు 'టైల్స్ బ్రోకెన్' ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటివరకున్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.
సహృద సంతోషం...
తన ప్రతిభతో పాటు సమాజానికి అవసరమైన సందేశాలివ్వటం చాలా సంతోషంగా ఉందని చిన్నారి సహృద చెబుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు తన ఆసక్తితోనే ఈ ఘనత సాధించానని తెలిపింది. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టటం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఈ చిన్నది ఆనందం వ్యక్తం చేస్తోంది.
సహృద ఏకసంతాగ్రాహి...
తమ కుమార్తె చిన్ననాటి నుంచే ఏకసంతాగ్రాహి అని సహృద తల్లిదండ్రులు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే పలు విషయాల పట్ల ఆసక్తి ఉండడం... వాటి పట్ల అవగాహన పెంపొందించుకోవటం వల్ల అన్ని రంగాల్లో దూసుకెళ్తుందన్నారు.
ఎనిమిదేళ్లలోనే పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ... వందల సంఖ్యలో బహుమతులు గెలుచుకుంది. అటు చదువు, ఇటు క్రీడల్లోనూ దూసుకుపోతోంది. ఇప్పుడు ఒక్కరోజులోనే ఏకంగా మూడు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టి అందరితో 'భళా సహృద' అనిపించుకుంటోంది.
ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై