ED Raids in EX Cricketers Houses in Hyderabad : ఉప్పల్ స్టేడియం నిర్మాణం సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు 2013లో అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేసిన కేసు.. కోర్టులో సమర్పించిన అభియోగపత్రాల ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు అప్పటి హెచ్‌సీఏ ప్రతినిధులు అర్షద్ అయూబ్, జి.వినోద్‌తో పాటు మరికొంత మంది ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు.. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరించారు.
ఒప్పందానికి విరుద్ధంగా 2013లో ఉప్పల్ స్టేడియంలో నిర్మాణాలు జరిగాయని ఏసీబీ అధికారులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. వాణిజ్య అవసరాలకు ఉప్పల్ స్టేడియంలో నిర్మాణాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఒప్పందంలో పేర్కొన్నా.. దాన్ని ఉల్లంఘించి స్టాండ్‌ల నిర్మాణం సందర్భంగా వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగాయని అనిశా పేర్కొంది. గుత్తేదారుతో కుమ్మక్కై హెచ్‌సీఏకు దాదాపు రూ.4 కోట్ల నష్టం వాటిల్లేలా చేశారని అనిశా అభియోగపత్రంలో పేర్కొంది. అనిశా అభియోగపత్రం ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ED Raids in Pharmax India Ltd in Hyderabad : మరోవైపు ఫార్మాక్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. రూ.62.5 కోట్ల విలువ చేసే స్థిరచరాస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేయగా.. అందులో ఫార్మాక్స్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లారెడ్డికి చెందిన ఆస్తులున్నాయి. శ్రీనివాస్‌రెడ్డికి చెందిన షేర్లను సైతం ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఫార్మాక్స్ ఇండియా లిమిటెడ్‌పై ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు.
2010లో అరుణ్ పంచారియా అనే వ్యక్తితో చేతులు కలిపిన శ్రీనివాస్‌రెడ్డి విదేశాల్లో తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీల పేరుతో సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని ఓ బ్యాంకులో రుణం తీసుకొని వాటిని దుబాయ్‌లో ఉన్న డొల్ల కంపెనీలకు మళ్లించారు. అక్కడి నుంచి భారత్‌లోని సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.