Madhucon Director Arrest Issue : మధుకాన్, రాంచీ ఎక్స్ప్రెస్ డైరెక్టర్ శ్రీనివాసరావు విడుదలపై ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్హైవే నిర్మాణం పేరిట బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఇతర వ్యాపారాలకు మళ్లించారన్న కేసులో శ్రీనివాసరావును ఇటీవల ఈడీ అరెస్టు చేసి నాంపల్లి ఈడీ కోర్టులో హాజరు పరిచింది. అయితే అతడిని అరెస్టు చేసిన తీరుపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టుకు సంబంధించి సీఆర్పీసీ 41 ఏ సెక్షన్ను అనుసరించలేదని ఈడీని తప్పు పట్టింది. రిమాండ్ విధించేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించడంతో శ్రీనివాసరావు విడుదలయ్యారు.
నాంపల్లి ఈడీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తూ.. అదే చట్టం ప్రకారం అరెస్టు చేసినట్లు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. పోలీసు విభాగాల మాదిరిగా సీఆర్ పీసీ 41ఏను అమలు చేయాలని నాంపల్లి కోర్టు పేర్కొనడం సమంజసం కాదన్నారు. వాదనలు విన్న హైకోర్టు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: indus viva founders arrest : రూ.1500 కోట్లు మోసం.. ఇండస్ వివా కంపెనీ వ్యవస్థాపకులు అరెస్టు