ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ షెడ్యూలు ఖరారయింది. ఈనెల 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 5, 6 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా అభ్యర్థులకు, జులై 7,8,9 తేదీల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఎంసెట్ నిర్వహించనున్నారు. రోజుకు రెండు పూటల ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు... మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు.
20 నుంచి మే 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 20 నుంచి మే 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ఆలస్య రుసుము 250 రూపాయలతో మే 28 వరకు, 500 రూపాయలతో జూన్ 7 వరకు, 2 వేల 500 రూపాయలతో జూన్ 17 వరకు, 5వేల రూపాయలు అదనంగా చెల్లించి జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్ తెలిపారు. ప్రవేశ పరీక్ష రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 400 రూపాయలు, ఇతరులకు 800 రూపాయలుగా నిర్ణయించారు.
ఏపీలో ఐదు కేంద్రాలు
ఇంజినీరింగ్, వ్యవసాయ ఎంసెట్ రెండింటికీ దరఖాస్తు చేస్తే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 800 రూపాయలు, ఇతరులు 1600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణలో 54, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరులో ఒక్కో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి వంద శాతం, ద్వితీయ సంవత్సరం నుంచి 70 శాతం సిలబస్‌ను ఎంసెట్‌లో ఇవ్వనున్నారు. మొదటి సంవత్సరం సిలబస్ నుంచి 55 శాతం, ద్వితీయ సంవత్సరం నుంచి 45 శాతం ప్రశ్నలు ఎంసెట్‌లో ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మూడు గంటల్లో 160 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: కమీషన్ ఆశచూపి.. రూ.1500 కోట్లు కాజేసి!