Dogs attacked on children భాగ్యనగరంలో వీధి కుక్కలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్న ఘటన మరవకుముందే రాజేంద్రనగర్ ఎర్రబోడ కాలనీలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఐదుగురిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అదే ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కరిచిన శునకం... చేయిపట్టుకొని ఈడ్చుకెళ్లిందని తల్లిదండ్రులు వాపోయారు. అడ్డుకునేందుకు యత్నించిన మరో బాలుడిపైనా తమ ప్రతాపం చూపాయి. వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
పిల్లలు ఆడుకుంటుంటే.. నాలుగైదు కుక్కలు దాడి చేశాయి. బ్లడ్ కూడా వచ్చింది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా... పట్టించుకోవడం లేదు. పిల్లలు అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. - స్థానికులు
హైదరాబాద్ చైతన్య పురి మారుతి నగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎన్నోసార్లు మున్సిపాలిటీ వెటర్నరీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా... చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోయారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం ఎస్సీ బాలుర వసతి గృహంలోకి చొరబడిన వీధి శునకం ఓ విద్యార్థిపై దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఏసయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కులు వెంబడించాయి. భయంతో బైక్‌పై నుంచి వ్యక్తి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని జటాయువు అటవీ ఉద్యానవనంలో జింక పిల్లపై వీధి కుక్కలు దాడి చేశాయి. పరిస్థితి విషమించిన జింక మ్యత్యవాతపడింది. అసలు వీధి కుక్కలు ఎలా ప్రవేశించాయనే అంశంపై అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రహరీకి మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ఘటన జరిగిందని సమీప కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: