గత ఏడాది ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప వైద్యాధికారి జి.నరేశ్‌కుమార్ కరోనాతో మరణించారు. తెలంగాణలో కొవిడ్‌తో కన్నుమూసిన తొలి వైద్యుడు ఆయన. 35 ఏళ్లకే ఆయన మృత్యువాత పడడం మొత్తం వైద్యరంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్, బయో కెమిస్ట్రీ విభాగాధిపతి అనురాధ, శోభారాణి, ప్రసన్నలక్ష్మి, శ్రీధర్, శ్రీనివాస్‌లు ఈ మహమ్మారికి బలైన సర్కారు వైద్యులు. ప్రైవేటు వైద్యులైన సువర్ణ, శ్రీలక్ష్మి, జయభారతి, జగన్‌మోహన్, ఆనందం, మధుసూదన్‌రావు, ఫక్రుద్దీన్, రామన్‌రావు, ఈశ్వర్‌ప్రసాద్, అభిషేక్, అయూబ్‌ఖాన్, వెంకట విద్యాసాగర్, పీటర్, రామ్మోహన్‌రావు, ప్రభాకర్‌రావు, యుగంధర్, ఫజల్‌అన్సారీ, శ్రీనివాస్, రామారావు, కోటేశ్వర్‌రావులూ మరణించారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో ఇప్పటి వరకు 400 మందికి పైగా వైద్యులు చనిపోయారు. వీరిలో 260 మంది రెండోదశలో ప్రాణాలు విడిచారు. రెండో దశలో రాష్ట్రానికి చెందిన వారు 25 మంది ఉన్నారని భారతీయ వైద్యసంఘం వెల్లడించింది. ఎక్కువ మంది 50-70 సంవత్సరాల వయసు వారని తెలిపింది.
సాయం అందలేదు
వైద్యులను కోల్పోయిన కొన్ని కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వపరంగా నరేశ్‌కు మినహా ఇతరులకు సాయం అందలేదు. కరోనా యోధుల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నా కేంద్రం నుంచి ఎవరికీ డబ్బులు రాలేదు. దీంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
అప్రమత్తంగా ఉన్నా....
నిత్యం రోగులకు పరీక్షలు నిర్వహిస్తూ, వారికి సలహాలు, సూచనలిచ్చే వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన వారి మాదిరిగా వృత్తికి దూరంగా ఉండే పరిస్థితి వారికి లేదు. అనివార్యంగా సేవలను అందించే క్రమంలో ఎంత అప్రమత్తంగా ఉన్నా వారికి ముప్పు తప్పడం లేదు. కొవిడ్ రోగులు వచ్చినప్పుడు, చికిత్స సమయంలో వారికి వ్యాధి సోకుతున్నట్లుగా భావిస్తున్నారు. కొంత మందికి తోటి వైద్యసిబ్బంది ద్వారా వస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది లక్షణాలను గుర్తించకపోవడం, గుర్తించినా వాటిని సాధారణమైనవిగా భావించి తమకు తామే నయం చేసుకునేందుకు యత్నిస్తూ కొంత అశ్రద్ధ చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చేరిన వారికి సైతం విపత్తు తప్పడం లేదు. వైద్యులతో పాటు వారి కుటుంబాలు సైతం వ్యాధిబారిన పడుతున్నాయి.
ఎక్కువ మంది టీకాలు తీసుకోకపోవడం వల్ల...
మృతిచెందిన వైద్యులంతా ప్రాక్టీసులో ఉన్న వారే. వైద్యుల్లో ఎక్కువ మంది టీకాలు తీసుకోకపోవడం వల్లనే మృత్యువాత పడ్డారని ఐఎంఏ, ప్రభుత్వ వైద్య ఐకాస వర్గాలు తెలిపాయి. గత ఏడాది టీకాలు రాకపోవడం వల్ల కొందరు టీకాలు వేసుకోలేదని, టీకాలు వచ్చిన తర్వాత వివిధ వ్యాధుల వల్ల వాటిని తీసుకోలేదని వెల్లడించాయి. కొంత మంది మొదటిడోస్ తీసుకున్న తర్వాత... ఇద్దరు రెండుడోస్‌ల తర్వాత చనిపోయారని తెలిపాయి.
ముగ్గురు పిల్లలు తండ్రిని కోల్పోయారు..
చిట్యాల నర్సింహకుమార్ (51) మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో ఫోరెన్సిక్ మెడిసిన్ అసిస్టెంటు ప్రొఫెసర్... జడ్చర్ల మండలానికి చెందిన ఆయన ఎంతో కష్టపడి డాక్టర్ అయ్యారు. చిన్ననాటి నుంచి సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివి ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. సొంత జిల్లా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఇన్‌సర్వీసులో ఫోరెన్సిక్ మెడిసిన్‌లో పీజీ పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో వైద్యకళాశాల ప్రారంభం కాగా అందులో చేరారు. అసిస్టెంటు ప్రొఫెసర్ అయ్యారు. వృత్తిలో నిబద్ధతతో ఆరోగ్యాన్నిలెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు కరోనా సోకింది. ముందుగా జడ్చర్లలోని ఆసుపత్రిలో చేరి మూడురోజుల పాటు చికిత్స పొంది ఆ తర్వాత హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. యాంటీజెన్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చినా.. సీటీ స్కానింగులో కరోనా లక్షణాలు కనిపించాయి. అప్పటికే పరిస్థితి విషమించి, ఏప్రిల్ 30న మరణించారు. చివరి సారిగా తనతో వారం రోజులకు ముందు వైద్యకళాశాలకు వెళ్తున్నానని చెప్పి మళ్లీ రాలేదని భార్య వీణాకుమారి ఆవేదనతో చెప్పారు. ముగ్గురు పిల్లలు తండ్రిని కోల్పోయి ఇంకా తేరుకోలేదు.
దంపతులిద్దరూ మృతి
నిజామాబాద్‌కు చెందిన వైద్య దంపతులు అవినాశ్, శోభాసుబేదార్ సుదీర్ఘకాలం ప్రభుత్వ సర్వీసులో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏప్రిల్6న అవినాశ్ (71)కి జ్వరం వచ్చింది. దగ్గు మొదలైంది. 9న పరీక్షలు చేయించుకోగా కరోనాగా నిర్ధారణ అయింది. స్థానిక ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 14న చనిపోయారు. ఆయన దవాఖానాలో ఉండగానే... భార్య శోభ (70)కు కరోనా వచ్చింది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 28న మరణించారు. వారి పిల్లలు రాహుల్, శ్వేతలు రెండువారాల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయారు.
17 రోజులు చికిత్స చేసినా..
ఆర్మూర్‌లోని మయూరి ఆసుపత్రిని భర్త నరేశ్‌తో కలిసి శిశువైద్యనిపుణురాలైన జయలక్ష్మి(55) నిర్వహిస్తున్నారు. జయలక్ష్మికి కరోనా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 30న ఆసుపత్రిలో చేర్పించారు. 17 రోజుల పాటు చికిత్స పొంది మృత్యువాత పడ్డారు. నరేశ్ తన సహధర్మచారిణిని, కూతురు అద్భుత తల్లిని కోల్పోయి విషాదంలో ఉన్నారు.
నిర్విరామంగా పనిచేయడం వల్లనే...
వైద్యులు నిర్విరామంగా పనిచేయడం, సరైన రక్షణ లేకపోవడం వల్లనే కరోనా బారిన పడుతున్నారు. అమెరికాలో కరోనా చికిత్సనందించే వారు వారం రోజులు పనిచేస్తే మరో వారం విశ్రాంతిలో ఉంటారు. దాని వల్ల వారిలో యాంటీబాడీస్ పెరుగుతున్నాయి. మన దేశంలోనూ ఈ విధానం రావాలి. మరణించిన వారిలో కొంత మంది టీకాలు తీసుకోలేదు. మరికొంత మంది ఒకసారి డోస్ తీసుకున్నారు. కొద్దిమంది రెండు డోసులు తీసుకున్నప్పటికీ విధుల్లో ఉన్నందున వైరస్ భారం (లోడ్) ఎక్కువై మరణిస్తున్నారు. టీకాలు తీసుకున్నామని పూర్తి భరోసాతోనో, నిర్లక్ష్యంగానో ఉండరాదు. మళ్లీ మళ్లీ వైరస్ సోకవచ్చు. అందరికీ యాంటీబాడీలు ఉత్పత్తి కావడం లేదు. కొందరిలో రోగనిరోధక శక్తి రాదు.
-డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ రాష్ట్ర (ఎలెక్ట్) అధ్యక్షుడు
ప్రభుత్వం ఆదుకోవాలి
నిత్యం విధుల్లో ఉంటూ...కరోనాతో మరణించిన వైద్యుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి వారికి రూ. 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ వైద్యసిబ్బందికి చికిత్స కోసం నిమ్స్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. వారి కుటుంబాలకు సైతం సాయం అందించాలి.
- బి.రమేశ్, ప్రభుత్వ వైద్యఆరోగ్య ఐకాస ఛైర్మన్
ఇదీ చూడండి: covid death: అమ్మా.. కళ్లు తెరువు.. అక్షతలేసి ఆశీర్వదించు