రాష్ట్ర ప్రజలతో పాటు వలస కూలీలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న సాయం తీసుకోవడంలో లబ్దిదారుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రేషన్ షాపుల్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం పంపిణీ చేస్తుంది. మరో పక్క నిన్నటి నుంచి రాష్ట్రానికి వలస వచ్చిన కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 ఇస్తుంది. ఈ నేపథ్యంలో అటు వలస కూలీలు, ఇటు రేషన్ బియ్యం కోసం ప్రజలు ఒక్కసారిగా డిపోల వద్దకు చేరుకుంటున్నారు.
కిక్కిరిసిన రేషన్ దుకాణాలు
రేషన్ షాపుల్లో టోకెన్ విధానం అమలు చేసి.. రోజుకి వందమంది చొప్పున అందరికి బియ్యం అందజేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ఇవాళ అన్ని రేషన్ షాపుల డీలర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. బియ్యంతోపాటే డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున్న ప్రజలు చౌకదుకాణాల వద్ద క్యూలు కడుతున్నారు. కానీ బియ్యం మాత్రమే పంపిణీ చేసి...నగదును బ్యాంక్ ఖాతాలో జమచేస్తామని డీలర్లు చెబుతున్నారు. నారాయణగూడ, ముషీరాబాద్, రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల, కూకట్పల్లి సహా పలు డిపోల వద్ద ఇలా... ఎంపిక చేసిన రేషన్ షాపుల వద్ద లబ్దిదారులు బారులుతీరారు.
బారులు తీరిన వలస దారులు
ఒడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు భారీ సంఖ్యలో బియ్యం పంపిణీ కేంద్రాలకు చేరుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు ఎంపిక చేసిన అన్ని ప్రాంతాల్లో వలస కూలీల పరిస్థితి ఈవిధంగానే ఉంది. సామాజిక దూరం పాటించకపోవడం వల్ల పోలీసులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా అందరూ వచ్చి ఇబ్బందులు పడొద్దు..అందరికీ బియ్యం పంపిణీ చేస్తామని సర్థిచెబుతున్నారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం