ఆ క్షణం..గాల్లో ప్రాణం... ఇది ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాల వద్ద వైద్యుల నోట వినిపించే మాట. ఇక్కడ ఆ కొద్ది నిమిషాల విలువ ఓ నిండు ప్రాణం. ఆ విలువ తెలిసిన అంబులెన్సుల డ్రైవర్లు క్షతగాత్రుల్ని, రోగుల్ని సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రులకు చేర్చేందుకు ప్రయత్నిస్తుంటారు. నగర దారులపై పెరుగుతున్న రద్దీ ఆ వేగానికి బ్రేకులేస్తోంది. అంబులెన్సు చక్రం కదలకుండా ఓవైపు ఇబ్బందులు ఎదురవుతుంటే.. రోడ్లపై ఎక్కడికక్కడ మూసేసిన యూటర్న్‌లు, మరమ్మతు పనులు మరోవైపు నరకం చూపిస్తున్నాయి. వెరసి నిమిషాల్లో చేరాల్సిన గమ్యానికి గంటలు పట్టేలా చేస్తున్నాయి. ఆసుపత్రికి చేరేలోపే బాధితుల పరిస్థితి విషమంగా మారుతుండగా.. కొన్నిసార్లు ప్రాణాలు పోతున్న ఘటనలూ ఉంటున్నాయి.

దారి లేకుండా చేస్తున్నారు!
నగరంలో ప్రధాన ఆసుపత్రుల వద్ద అంబులెన్సు లోపలికి చేరాలన్నా నరకమే. ఎక్కడికక్కడ యూటర్న్‌లు మూసేసి, బారికేడ్లు పెట్టి ఉస్మానియా, నిమ్స్‌లాంటి పెద్దాసుపత్రులకు దారి లేకుండా చేస్తున్నారు. పాతబస్తీలో మరీ ఘోరం. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రధాన రహదారులపై అంబులెన్సుల కోసం ప్రత్యేక దారి కేటాయించేందుకు నాలుగేళ్ల క్రితం ట్రాఫిక్ పోలీసులు ప్రణాళికలు రూపొందించారు. ఆ నిర్ణయం క్షేత్రస్థాయిలో సాధ్యం కాకపోవడంతో అటకెక్కింది. ఆ తర్వాత అంబులెన్సులకు దారివ్వని వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా.. కొన్ని జిల్లాల్లో అమలవుతోంది. నగరంలో చర్యలు శూన్యం. ప్రస్తుతానికి సిగ్నళ్ల వద్ద కానిస్టేబుళ్లే దారిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
‘‘పాతబస్తీలో అంబులెన్సు కోసం ఫోన్ వస్తే భయమేస్తోంది. వాహనం వెళ్లేందుకు దారి ఉండదు. వెళ్లడంలో, బాధితుల్ని ఆసుపత్రికి చేర్చడంలో ఏమాత్రం జాప్యం చేసినా.. ఏదైనా జరగరానిది జరిగితే వారి తరఫు బంధువులు అద్దాలు పగలగొట్టడం, మాపై దాడి చేసిన ఘటనలున్నాయి’’ - భరత్, అంబులెన్సు నిర్వాహకుడు
ప్రాణాలంటే విలువ లేదా..?

1 .‘‘సారీ.. ఐదు నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే బతికించేవాళ్లం..’’
2. మాసాబ్‌ట్యాంకు వంతెన వద్ద శనివారం సాయంత్రం 20 నిమిషాల పాటు ప్రొటోకాల్ పేరిట వాహనాల్ని నిలిపేయడంతో ఓ అంబులెన్సు చిక్కుకుంది. రోగి ప్రాణాల మీదికి రావడంతో వైద్యులే వచ్చి ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనదారులూ గొంతు కలపడంతో తాత్కాలికంగా వాహనాల్ని వదిలారు.
3. గతంలో కోఠి ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ 2 కి.మీ.లు పరుగెత్తి అంబులెన్సుకు దారి చూపిన విషయం విదితమే. రెండు నెలల క్రితం ఉప్పల్ మెట్రో కేంద్రం వద్ద ఓ అంబులెన్సు దాదాపు 20 నిమిషాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. రోగి మృతి చెందినట్లు ఆ అంబులెన్సు డ్రైవర్ చెప్పారు.
4.కొద్దిరోజుల క్రితం నెక్లెస్‌రోడ్‌లో ఉద్యాన ప్రదర్శనకు భారీగా సందర్శకులు రావడంతో ఖైరతాబాద్ కూడలి నుంచి సెక్రటేరియట్ వరకూ రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. గంటసేపు రెండు అంబులెన్సులు మొత్తుకున్నా దారి లభించలేదు. ఇలా రోజూ అంబులెన్సులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి.
5. ఇటీవల ఎల్‌బీనగర్ ప్రధాన రహదారిపై ధర్నాతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.. 20 నిమిషాల పాటు రెండు అంబులెన్సులు చిక్కుకుపోయాయి.
‘‘రోడ్లపై అనవసరమైన చోట్ల బారికేడ్లు పెడుతున్నారు. సులువుగా చేరే దారుల్ని మూసేస్తున్నారు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అంబులెన్సు హారన్ వినిపించినా కదలని వాళ్లు చాలామంది ఉన్నారు. రోజూ ట్రాఫిక్‌తో నరకమే.’’ - అఫ్తర్, అంబులెన్సు డ్రైవర్
ఇవీ చదవండి:
Covishield Vaccine: 'కొవిషీల్డ్ టీకాతో 93 శాతం రక్షణ'