పెండింగ్‌లో పెట్టిన ఆ 45 స్థానాల్లో సిట్టింగ్‌లకు నిరాశేనా..? అందరి దృష్టి తెరాస రెండో జాబితాపై పడింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో రెండింటికి ప్రకటించి మిగిలిన అడిక్‌మెట్, ముషీరాబాద్, కవాడిగూడ, భోలక్‌పూర్ డివిజన్లను పెండింగ్‌లో ఉంచారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో కూకట్‌పల్లి, బాలానగర్; అలాగే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శేరిలింగంపల్లి, చందానగర్, వివేకానందనగర్, హైదర్‌నగర్ డివిజన్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను పెండింగ్‌లో ఉంచారు.
ఎమ్మెల్యే ప్రకటించినా... రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అయిదు డివిజన్లున్నాయి. మూడింటికి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అభ్యర్థులను ఇటీవల ప్రకటించారు. అయితే తాజా జాబితాలో ఈ నియోజకవర్గంలోని అయిదు డివిజన్లను కూడా పెండింగ్‌లో పెట్టారు.
బంధువుల్ని బరిలోకి... ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ చర్లపల్లి డివిజన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ స్థానికులకే టిక్కెట్‌ను కేటాయించాలంటూ కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి తన సతీమణిని బరిలోకి దించాలని బొంతు రామ్మోహన్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏఎస్‌రావు నగర్ నుంచి ఓ మంత్రి తన కోడలును రంగంలోకి దింపుతారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి సికింద్రాబాద్ నుంచి తన కూతుర్ని పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానాన్ని కూడా పెండింగ్‌లోనే ఉంచారు.
గులాబీ కండువా కప్పుకొన్నా... నాచారంలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి శాంతి సాయిజెన్ గెలుపొందారు. ఆ తర్వాత ఆమె తెరాసలో చేరారు. సిట్టింగ్‌లకే అవకాశమివ్వాలని నిర్ణయించడంతో మరోసారి టిక్కెట్ ఆమెకే ఖాయమని తెలుస్తోంది. తీరా తన భార్యకు టిక్కెట్ దక్కలేదంటూ ఆ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్ అనుచరులతో ఆందోళనకు దిగాడు. దీంతో ఈ స్థానాన్నీ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
ఒకే కుటుంబంలో ఇద్దరికీ... ఒకే కుటుంబంలో ఇద్దరికి రెండు టిక్కెట్లు దక్కాయి. పాతబస్తీ శాలిబండా నుంచి తండ్రి రాధాకృష్ణ, ఝాన్సీబజార్ నుంచి కూతురు పి.ఇషిత పోటీ చేస్తున్నారు. హాఫీజ్‌పేట నుంచి వి.పూజితకు టిక్కెట్ దక్కింది. ఆమె భర్త జగదీశ్వర్‌గౌడ్ మాదాపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ సిట్టింగ్ కార్పొరేటర్లే.
పోటీ చేసేందుకు ఆసక్తి లేదంటూ.. తొలి జాబితాలో ముగ్గురు సిట్టింగ్‌లకు అవకాశం దక్కలేదు. వీరిలో ఒకరిద్దరు తమకు మళ్లీ పోటీ చేసే ఆసక్తి లేదని చెప్పడంతో మార్పు చేసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన చోట స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నారు.
ఈసారి సర్దుకుపోండి.. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. దీంతో 30 శాతం మంది సిట్టింగ్‌లకు టిక్కెట్ ఇవ్వొద్దని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వాలంటూ సదరు ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈసారి సర్దుకుపోవాలంటూ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ నచ్చజెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది.