రాష్ట్రంలో చేపట్టనున్న డిజిటల్ భూ సర్వే(Digital Land survey)కు మూలాధారంగా ధరణి పోర్టల్లోని వివరాలనే పరిగణించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పైలట్ సర్వే పూర్తికాగానే అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి సర్వే చేపట్టనుండగా, ఇప్పటికే డిజిటలీకరించి ధరణిలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని సర్వేకు ఉపయోగించనున్నట్లు సమాచారం.
భూముల వివరాల ఆధారంగా...
ప్రభుత్వం కూడా ధరణి పోర్టల్లో (Dharani portal) ఉన్న సమాచారానికి భిన్నంగా సర్వే ఉండొద్దని, పోర్టల్లోని రైతుల భూముల వివరాల ఆధారంగా చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. రెవెన్యూ, భూమి కొలతలు, భూ దస్త్రాల నిర్వహణ శాఖలు ఇప్పటికే గ్రామాల పటాలు, నక్షలను సేకరించే పనిని ముమ్మరం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబరు 2 నుంచి ధరణి పోర్టల్ (Dharani portal) ద్వారా భూముల నిర్వహణను అమల్లోకి తెచ్చింది. దానికి ముందు 2017 సెప్టెంబరు నుంచి మూడు నెలల పాటు రెవెన్యూశాఖ గ్రామాల్లో భూదస్త్రాల ప్రక్షాళన చేపట్టి, సమాచారాన్ని నవీకరించింది.
డిజిటలీకరణ...
అనంతరం స్పష్టత ఉన్న దస్త్రాలను అధికారులు డిజిటలీకరించారు. భూ నిర్వహణ విధానం వెబ్సైట్లో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారాన్నే ధరణి పోర్టల్ ద్వారా అధికారికంగా అమల్లోకి తెచ్చారు. ప్రక్షాళన సందర్భంగా అనేక రకాల సమస్యలను నమోదుచేశారు. వాటిలో ప్రధానంగా భూ సర్వేతో ముడిపడి ఉన్న వాటిని పార్ట్-బి కింద చేర్చి పక్కన పెట్టారు. రెవెన్యూశాఖ వద్ద ఉన్న మాతృ దస్త్రాల పరిశీలనతో పరిష్కారమయ్యే సమస్యలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్పష్టత ఇస్తున్నారు. ఆ రైతులకు యాజమాన్య హక్కులు జారీచేసి, ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న భూసర్వేకు ధరణి పోర్టల్లోని భూముల సమాచారాన్నే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
భూమి కొలతల శాఖ లేదా రెవెన్యూశాఖ వద్ద పాత పటాలు, వివరాలతో సర్వే నిర్వహిస్తే ఎక్కడైనా తేడాలు వస్తే గందరగోళం ఏర్పడుతుందనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. పోర్టల్లోని రైతుల వివరాలు, సర్వే నంబర్లు, ఖాతాలు, విస్తీర్ణం వివరాల ఆధారంగా సర్వే చేస్తే సమస్యలు ఉండవని భావిస్తున్నారు. గ్రామాల హద్దులు, ఇతర వివరాలకు మాత్రమే పాత పటాలను అనుసరించనున్నట్లు సమాచారం.
మార్గదర్శకాల రూపకల్పన...
రాష్ట్రవ్యాప్త భూ సర్వే (Land survey)కు సమాయత్తమవుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించనుంది. పైలట్ సర్వే ముగియగానే.. సర్వే సంస్థలకు ప్రక్రియను అప్పగించేందుకు టెండర్లు పిలిచి ఒప్పందం కుదుర్చుకుంటారు. కాల పరిమితిని అంచనా వేసి వాలంటీర్లను నియమించుకుని వారితో గ్రామానికో బృందాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిపై అధికారులు, సిబ్బంది, వలంటీర్లందరికీ శిక్షణ ఇస్తారు.
ఇదీ చూడండి: కరోనా అంతం కోసం 'దెయ్యాల నృత్యం'