ఎన్నడూ లేని విధంగా జంట నగరాల్లో కురిసిన వర్షాలకు ప్రజా జీవనం తీవ్ర ఇబ్బందులకు గురైందని... వెంటనే తాము ఆదుకున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం రెండో దశ పంపిణీని శుక్రవారం ఆయన ప్రారంభించారు. బాధితుల ఇంటికి అధికారులు వెళ్లి సాయం అందిస్తారని, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సికింద్రాబాద్ పరిధిలో భారి వర్షాలు కురిసినప్పటికీ ఇబ్బందులు తలెత్తకుండా... ఐదేళ్ల కాలంలో తాము చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు అందించాయని తెలిపారు. వరద సాయం డబ్బులు పొందేందుకు లంచాలు చెల్లించరాదని సూచించారు. చిలకలగూడలోని ఈద్గా, ఎరుకల బస్తీ తదితర ప్రాంతాల్లో అధికారులు, నేతలతో కలిసి నగదు అందజేశారు. 16 అధికారుల బృందాలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. బౌద్దనగర్లోని అంబార నగర్, సంజయ్ గాంధీ నగర్, ఏకశిలా మెడికల్, తార్నాకలోని ఓయూ క్యాంపు, అడ్డగుట్ట డివిజన్లోని నార్త్ లాలాగూడ ప్రాంతాల్లో వరద బాధితులకు నగదును పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, శ్రీమతి ధనంజన బాయి గౌడ్, అలకుంట సరస్వతి, విజయ కుమారి, తెరాస యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్లతో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి: 'అప్పటి వరకు అర్ణబ్ను అరెస్టు చేయవద్దు'