ఏపీ విశాఖ గీతం వర్సిటీకి చెందిన కట్టడాలు కూల్చివేతపై వర్సిటీ సిబ్బంది స్పందించారు. తెల్లవారుజామునే తమకు సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తమకు సమాచారం వచ్చిందని.... వర్సిటీకి వచ్చేలోపే ఎవరినీ లోపలికి అనుమతించలేదని వర్సిటీ సిబ్బంది తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా చేయడం దురదృష్టకరమని వర్సిటీ సిబ్బంది మండిపడ్డారు. మార్కింగ్ ముందే చేశారనడం అవాస్తవమని.. ఇప్పుడు చేస్తున్నారని వర్సిటీ సిబ్బంది తెలిపారు. న్యాయపరమైన అంశాలన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని...గుట్టుచప్పుడు కాకుండా వచ్చి కూల్చడం అన్యాయమని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని వర్సిటీ సిబ్బంది స్పష్టం చేశారు. ఉన్నత విద్యాసంస్థకు సాయం చేయాలిగానీ ఇలా చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హుద్‌హుద్ సమయంలోనూ గీతం వర్సిటీ సేవా కార్యక్రమాలు చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు.
యాజమాన్యానికి తెలుసు: ఆర్డీవో
"వర్సిటీకి చెందిన 40 ఎకరాల భూమి ఆక్రమణలో ఉంది. ఆక్రమణకు సంబంధించి వర్సిటీ యాజమాన్యం సంప్రదింపులు జరిపింది. ప్రభుత్వ విధానం మేరకు ఆక్రమణల తొలగించాం. ప్రస్తుతం ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం కూల్చివేత చేపట్టాం. ఆక్రమణలో ఉన్న భూమిలో కొన్ని భారీ కట్టడాలు కూడా గుర్తించాం. తదుపరి దశలో వాటిని కూడా కూల్చివేసే ప్రక్రియ ఉంటుంది. ఆక్రమణలకు సంబంధించి సర్వే ప్రక్రియ 5 నెలలుగా చేస్తున్నాం. యాజమాన్యానికి పూర్తి అవగాహన, సమాచారం రెండూ ఉన్నాయి."
-పెంచల కిశోర్, ఆర్డీవో
ఇదీ చదవండి: విశాఖ గీతం వర్సిటీకి చెందిన కొన్నికట్టడాలు కూల్చివేత