రాబడి లేదు... ఖర్చు మాత్రం అంతకంతకూ పెరుగుతోంది... ఏప్రిల్ నెల గడిచేదెలా? అని రాష్ట్ర ఆర్థిక శాఖ తర్జనభర్జనలు పడుతోంది. లాక్‌డౌన్ వల్ల నెలకు రూ.6500 కోట్ల రాబడులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు అందుబాటులోకి వస్తాయో స్పష్టత లేదు. రాష్ట్రానికి ఏప్రిల్ నెలలో నికరంగా అందిన మొత్తం రూ.2000 కోట్లు. ఇది కూడా బాండ్ల విక్రయం ద్వారా వచ్చింది. ఈ నెల 28న మరో రూ.1000 కోట్లు బాండ్ల ద్వారా రానుంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రూ.1400 కోట్లు. మిగిలిన నిధులను సమీకరించుకోవడంపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ నెల పూర్తిగా లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. ఫలితంగా జీఎస్టీ, ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వచ్చే అమ్మకం పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రాబడి, రవాణాశాఖ ద్వారా రావాల్సిన ఆదాయంలో నామమాత్రంగా కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆర్థిక చిక్కులు తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ వ్యయం కనీసం రూ.10 వేల కోట్లుగా అంచనా వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛన్లు, ఆసరా పింఛన్లు. కరోనా నేపథ్యంలో తెల్లకార్డుదారులకు రూ.1500 చొప్పున అందించిన మొత్తం, వడ్డీలు, అప్పుల చెల్లింపు, కొవిడ్-19 నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ వ్యయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే రూ. పదివేల కోట్లు కావాలని లెక్క గట్టారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధానమంత్రిని కోరారు. కేంద్రం నుంచి దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. జీఎస్టీ పరిహారం కింద రావాల్సిన రూ. 2000 కోట్లు కేంద్రం వెంటనే ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతాయని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం నుంచి పన్నుల వాటాగా రాష్ట్రానికి ప్రతి నెలా రూ.1400 కోట్లు రావాల్సి ఉంది.
గతంలో కేంద్రం పన్నుల రాబడి తగ్గిందని రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాను తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పూర్తిగా ఇస్తుందా? కోత విధిస్తుందా? అనేది సందేహమే. పన్ను రాబడులను పంపిణీ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక వ్యయాన్ని కేంద్రం సర్దుబాటు చేయకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ప్రభుత్వ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండిః 'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!