Decisions of Congress PAC: దిల్లీలో వరి నిరసన దీక్ష అక్కర్లేదని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో (పీఏసీ) ఎక్కువ శాతం మంది నేతలు అభిప్రాయపడ్డారు. వదీక్ష వల్ల పార్టీకి ప్రయోజనం ఉండకపోగా.. కేసీఆర్‌కు మేలు జరిగే అవకాశం ఉందని భావించారు. పసుపు, మిర్చిలపై దిల్లీ స్థాయిలో నిరసనలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరితోపాటు పలువురు నాయకులు పీఏసీ దృష్టికి తీసుకెళ్లారు.
కమిటీ తీసుకున్న మరిన్ని నిర్ణయాలివే..
- పంటల వారీగా అధ్యయనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నివేదిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
- పంటల వారీగా రైతుల సమస్యలపై అధ్యయనానికి సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. వ్యవసాయం, రైతు సమస్యలపై అనుభవం కలిగిన కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నివేదిక సిద్ధం చేయాలని పీఏసీ నిర్ణయించింది.
- వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధ్యయనం కోసం.. ఛత్తీస్‌గఢ్‌కు కిసాన్ కాంగ్రెస్ బృందాన్ని పంపాలని పీఏసీలో నిర్ణయించారు. ఛత్తీస్‌గఢ్‌లో చిరుధాన్యాల సాగుపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
- పార్టీలో జరిగే క్రమశిక్షణ ఉల్లంఘనలపై ఉపేక్షించరాదని సీనియర్ నేత వీ హనుమంతరావు ప్రస్తావించడంతోపాటు మంచిర్యాలలో చోటుచేసుకున్న ఘటనను వివరించారు. దీనిపై స్పందించిన క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డి కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 10న జరిగే క్రమశిక్షణ కమిటీ భేటీలో అన్ని విషయాలను చర్చిస్తామని చిన్నా రెడ్డి తెలిపారు.
- పార్టీ సభ్యత్వం విషయంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని పీఏసీ నిర్ణయించింది.
ఇదీ చదవండి: MP Arvind in Lok Sabha: 'బియ్యం కుంభకోణంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలి'