Jagananna Smart Township : ఆంధ్రప్రదేశ్ అమరావతి పరిధిలోని నవులూరు వద్ద జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌లో భాగంగా సీఆర్‌డీఏ లేఅవుట్ వేస్తోంది. గతంలో ‘అమరావతి టౌన్‌షిప్’ కోసం రైతుల నుంచి "వీజీటీఎం-ఉడా" సేకరించిన భూమిలో కొంత అమ్మేయగా... మిగిలిన దాంట్లో లేఅవుట్ వేస్తున్నట్టు ప్రకటించింది. ప్రైవేటు రియల్‌ఎస్టేట్ సంస్థకు తీసిపోనట్టుగా బ్రోచర్ కూడా రూపొందించింది. చదరపు గజం 17,500 రూపాయల చొప్పున స్థలాలను అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇతర ప్రైవేటు లేఅవుట్లలో ఉన్న ధర కంటే ఇది ఎక్కువే. అయితే.. లేఅవుట్ అభివృద్ధికి సీఆర్‌డీఏ హడావుడిగా శంకుస్థాపన చేసిన భూమి... ప్రస్తుతం హడ్కో తనఖాలో ఉంది.
2016లో రాజధాని ప్రాంతంలో ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధికి రుణం కోసం... అమరావతి టౌన్‌షిప్‌లోని 145.59 ఎకరాలను హడ్కోకు సీఆర్‌డీఏ తనఖా పెట్టింది. దానిలో 2.03 లక్షల చదరపు గజాలు ప్లాట్లుగా అభివృద్ధి చేసిన స్థలంతోపాటు... 102.09 ఎకరాల ఖాళీ స్థలముంది. ఆ భూమిని తనఖా పెట్టినందుకు హడ్కో అప్పట్లో 1,275 కోట్ల రుణమిచ్చింది. దానిలో 1,151.59 కోట్లను ఇప్పటివరకు సీఆర్‌డీఏ తీసుకుంది. ఆ భూమిని హడ్కో నుంచి విడిపించుకుని స్మార్ట్‌టౌన్‌షిప్ అభివృద్ధి చేయాలని భావించి... దానికి బదులు రాజధాని పరిధిలోని మరోచోట 407 ఎకరాల్ని తాకట్టు పెట్టింది.
హడ్కో నుంచి తీసుకున్న 1,151.59 కోట్లలో అసలు, వడ్డీ కలిపి సీఆర్‌డీఏ కొంత జమ చేసిందని సమాచారం. ఇప్పుడు 407 ఎకరాల్ని కుదువ పెట్టడం ద్వారా 1,275 కోట్ల రుణాన్ని మళ్లీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో తీసుకున్న రుణానికి సంబంధించి ఇంకా బకాయి ఉన్న అసలు, వడ్డీ జమ కట్టుకుని... మిగతా మొత్తాన్ని సీఆర్‌డీఏకు హడ్కో ఇస్తుందని తెలిసింది. ఆ డబ్బుతోనే ఇప్పుడు నవులూరు సమీపంలో స్మార్ట్‌టౌన్‌షిప్ అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.
రైతుల ఆగ్రహం..
రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల్ని తనఖాపెట్టి, జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్ పేరుతో ప్రభుత్వం వ్యాపారానికి సిద్ధమైందంటూ అమరావతి రైతులు మండిపడుతున్నారు. రాజధానిగా అమరావతిని వద్దంటున్న వారు... ఇక్కడి భూములను ఎందుకు తనఖా పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
అప్పుడు ప్రాజెక్టుకు.. ఇప్పుడు హడ్కోకు
రాజధాని పరిధిలోని అనంతవరం ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి కేటాయించిన 200 ఎకరాలు, ఉద్ధండరాయునిపాలెంలో 49 ఎకరాలు, మందడం రెవెన్యూ పరిధిలోకి వచ్చే 157 ఎకరాలను... హడ్కో వద్ద సీఆర్‌డీఏ తనఖా పెట్టింది. రాజధాని ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో ఉన్న ఉద్ధండరాయునిపాలెం, మందడం భూములు చాలా విలువైనవి. గతంలో సుమారు 1700 ఎకరాల్ని స్టార్టప్ ఏరియాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఆర్‌డీఏ... సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్, అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్ కన్సార్షియంతో ఒప్పందం కూడా చేసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, రాజధానిపై వైఖరి అర్థమయ్యాక.... ఆ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం వైదొలగింది. గతంలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములనే... ఇప్పుడు హడ్కోకు సీఆర్‌డీఏ తనఖా పెట్టింది.
ఇదీ చదవండి: CM KCR Yadadri Visit: యాదాద్రిలో కేసీఆర్ పర్యటన.. పునర్నిర్మాణ పనులపై దిశానిర్దేశం..