కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనని అన్నారు. దేశంలో యుద్ధప్రాతిపదిక ఈ విపత్తును ఎదుర్కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని వైద్య వనరులు వినియోగించి వైరస్ నివారణకు కృషి చేయాలని వీరభద్రం సూచించారు. సీపీఎం కార్యకర్తలు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
వలస కార్మికులను ఆదుకోవాలి
కరోనా విజృంభణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వలస కార్మికులు ఉపాధికోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించడం నిరాశపర్చిందన్నారు. ఆరు నెలల పాటు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, రు.7500లు నగదు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రక్షణశాఖ ఆధ్వర్యంలోని హాస్పిటల్స్, డాక్టర్స్, వాహనాలు, రక్షణ సిబ్బందిని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చండి
ఆక్సిజన్, రెమ్డెసివిర్ మందులు, వ్యాక్సిన్, బెడ్స్, డాక్టర్ల కొరత ఉందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. పేద ప్రజల ఇళ్లలో సదుపాయాల్లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్, ప్రభుత్వ కాలేజీలు, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం, రాజీవ్ స్వగృహాలను క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అక్కడ వైద్య వసతులు, ఆహారం కల్పిస్తే ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. రోజువారీ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన యంత్రాంగాన్ని నియమించి కరోనాను కట్టడి చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు.