రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే 50 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. ఇప్పటివరకు తెలంగాణలో మహమ్మారి బారిన పడి 18 మంది మృతి చెందారు. 496 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురు మాత్రమే ఐసీయూలో ఆక్సిజన్ పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వైరస్ బారినపడి చికిత్స పొందుతున్న వారిలో 128 మంది నమూనాలు పరీక్షిస్తే.. వారిలో రెండుసార్లు నెగిటివ్ వచ్చిన 68 మందిని గురువారం డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తంగా కరోనా కోరల్లోంచి బయటపడిన వారి సంఖ్య 186కు చేరింది.
తెలంగాణలో అతివేగంగా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన 700 కేసుల్లో 106 కేసులు 11 కుటుంబాల్లోనే నమోదయ్యాయి. అన్నీ మర్కజ్ నుంచి వెళ్లివచ్చిన కుటుంబాలే కాగా.. ఒక్కరి ద్వారానే 20, 15, 14 మంది చొప్పున కుటుంబ సభ్యులకు వైరస్ సోకింది. వీరిలో 6 నెలల పసికందు నుంచి పదేళ్ల లోపు చిన్నారులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 10 వేల పరీక్షలు నిర్వహించగా.. వీటిలో 645 కేసులు మర్కజ్ ప్రయాణికులేనని వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది.
అమ్మనాన్నలున్న ఆస్పత్రిలోనే పిల్లలు:
అమ్మానాన్నలతో పాటు... తాత, అవ్వ, చిన్నాన్న, చిన్నమ్మ ఇలా కుటుంబాల్లో అత్యధికులు కరోనా బారినపడుతుండడం వల్ల వారిళ్లలో వైరస్ సోకని చిన్నారుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించింది. ఇలాంటి చిన్నారుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయమ్మలను నియమించి, పిల్లల సంరక్షణ బాధ్యతలకు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ముందుగా కోలుకొని బయటకు వస్తే వారికి పిల్లలను అప్పగిస్తారు.
పురుషులకు, మహిళలకు వేర్వేరు అంతస్తులు:
గాంధీ ఆస్పత్రిలో ఒకే అంతస్తులో స్త్రీ, పురుషులకు వేర్వేరు వార్డుల్లో చికిత్స అందిస్తుండగా... అత్యవసరంగా వేర్వేరు అంతస్తుల్లో మహిళలు, పురుషులకు వార్డులు ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా పారిశుద్ధ్యాన్ని మెరుగ్గా ఉంచాలని మంత్రి సూచించారు. ఈ విషయంపై ఆసుపత్రి పారిశుద్ధ్య గుత్తేదారులతో ఈటల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి..
జీహెచ్ఎంసీ పరిధిలో వేగంగా కేసుల సంఖ్య పెరగడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుటికీ పాజిటివ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా గడిపినవారిలో కొందరు బయటకు రావడంలేదని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. కరీంనగర్‌లో ఇండోనేసియా పౌరుల్లో వైరస్ గుర్తించినప్పుడు, అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారో అటువంటివే జీహెచ్ఎంసీ పరిధిలోనూ అమలు చేయాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయానికొచ్చారు. మరింత పకడ్బందీగా కంటైన్‌మెంట్ ప్రాంతాలను జల్లెడ పట్టాలని.. రెడ్‌జోన్‌గా గుర్తించిన ప్రాంతాల్లో ఒక్కరిని కూడా బయటకు రాకుండా నియంత్రించాలని తీర్మానించారు. వైరస్ పాజిటివ్ సోకిన వ్యక్తులతో కలివిడిగా ఉన్న వారిలో పరీక్షలు నిర్వహించి, నాణ్యమైన వైద్య సేవలందిస్తున్న ధైర్యాన్ని విశ్వాసాన్ని వారిలో కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మర్కజే కాకుండా గుజరాత్‌కు వెళ్లొచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు తేలడం వల్ల ఆ తరహాలోనూ కేసుల గుర్తింపుపై వైద్యాధికారులు దృష్టి పెట్టారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!